Wednesday, January 22, 2025

కుమ్మక్కయ్యింది రేవంత్, కెటిఆరే…నేను కాదు:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

జన్వాడ ఫాంహౌస్ కేసులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్, కేటీఆర్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని అందుకే కెటిఆర్‌ను అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ రేవంత్‌రెడ్డి గారూ మిమ్మల్ని జైలుకు పంపిన విషయం మర్చిపోయారా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌రెడ్డిని తన బిడ్డ పెండ్లికి వెళ్లకుండా ఆ రోజుల్లో బిఆర్‌ఎస్ సర్కారు అడ్డుకున్న సందర్భాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మిమ్మల్ని జైలుకు పంపిన వారితో రాజీపడతారా అంటూ రేవంత్‌రెడ్డిని రెచ్చగొట్టే ధోరణిలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, తాను ఒక్కటేనని కేటీఆర్ అనేక పర్యాయాలు ఆరోపించిన విషయాన్ని, సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతిని బండి సంజయ్ పేర్కొంటూ ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే రేవంత్,

కేటీఆర్ మధ్యనే రాజీ ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యానించారు. రేవంత్, తాను ఒక్కటే అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, కేటీఆర్ తెలంగాణ యాక్టివ్ సీఎం అని విమర్శించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాష్ట్రంలో రాజీపడి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీని మీడియాలో కూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేకుండా చేయాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కానీ ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బిఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదని విమర్శించారు. కెటిఆర్ అహంకారి అని ప్రధానిని కూడా కేటీఆర్ ఏకవచనంతో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కేంద్రమంత్రి హెచ్చరించారు.

పాదయాత్ర మూసీలో ఇళ్లు కూల్చిన చోట చేయాలి
హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చి నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేయడం ఏమిటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మూసీ నది పక్కన ఇళ్లు కూల్చేసిన చోటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై పాదయాత్ర చేయాలని సూచించారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు బయటకు వస్తే లీడర్ ఎలా అవుతారని బండి సంజయ్ ప్రశ్నించారు. కెటిఆర్‌కు అహంకార ధోరణి తగ్గలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే దమ్ము బిఆర్‌ఎస్ కు లేదని అన్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారో, లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు.

అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్‌ల పొట్టగొట్టి ఇప్పుడు వాళ్ల పక్షానే ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కెటిఆర్ గత చరిత్ర, వాళ్ల నాన్న చేసిన వ్యాపారం అందరికీ తెలుసునని బండి పేర్కొన్నారు. ఆయనకు ఆయనే మలేషియా పారిపోయాడని కేటీఆర్ ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీశ్ రావు మాత్రమేనని చెప్పిన బండి సంజయ్ ఆయన బీజేపీలో చేరుతానంటే తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, పార్టీ సమిష్టిగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News