Friday, December 27, 2024

జర్నలిస్టుల కు భూ కేటాయింపులు రద్దు బాధాకరం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

భూ కేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం తీర్పు బాధాకరం
జర్నలిస్టులకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అన్యాయం చేశాయి
బిజెపి అధికారంలోకి వస్తే అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః జర్నలిస్ట్‌ల హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. అట్లాగే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇండ్లులేని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని ఈ విషయంలో ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తిగా సహకరించేందుకు సిద్ధం ఉందని తెలిపారు.

అలాకాకుండా ఇండ్ల స్థలాలివ్వకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, జర్నలిస్టులతో కలిసి మహోద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అయితే జర్నలిస్టులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోని జెఎన్‌జే హౌసింగ్ సొసైటీ జర్నలిస్టులతోపాటు రాష్ట్రంలోని అర్హులైన విలేకరులందరికీ ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై మంగళవారం స్పందించిన బండి సంజయ్ హైదరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.

జేఎన్‌జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని, అయితే అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాచాల్సిందేనని అన్నారు. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణమని విమర్శించారు. 17 ఏళ్ల క్రితం పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు రూ.2 లక్షల చొప్పున రూ.12 కోట్లు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లించి జేఎన్జే హౌజింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒకసాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని ఆ ప్రకటనలో వాపోయారు.

కేసీఆర్ పాలనలో జర్నలిస్టుల బతుకులు మరీ దుర్భరమని, ఇండ్ల స్థలాలడిగితే లాఠీలతో కొట్టించారని, ప్రశ్నించే జర్నలిస్టులను వృత్తిలో కొనసాగకుండా అడుగడుగునా అవమానించిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు. జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకున్నాయని రెండు పార్టీలపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూసి ఎంతో మంది జర్నలిస్టులు అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ఆదుకోవడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తీవ్రంగా విఫలమయ్యాయని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News