కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. సోమవారం మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో “సుపరిపాలన దినోత్సవం” నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి’ అని అన్నారు.
ఇంకా ‘లక్షలాది కుటుంబాలవారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు”అని ప్రశ్నించారు. తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. త్వరలో స్థానిక, పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. అంతలోపే లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు. ఎన్నికల సాకుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా దరఖాస్తులకే పరిమితం కావొద్దని కోరుతున్నానని తెలిపారు. నిజమైన లబ్ధ్దిదారులను గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరుతున్నానని అన్నారు.
బిఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీదారు కానేకాదు, ఈ ఎన్నికల్లో బిజెపి అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం తథ్యం అన్నారు. శ్వేతపత్రం..స్వేదపత్రం అంటూ అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారు అని ఆరోపించారు. నేనడుగుతున్నా.. 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే తెలంగాణలో 6.75 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశారు? అని ప్రశ్నించారు. కోవిడ్ టైంలో మోదీ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడంతోపాటు 80 దేశాలకు పైగా ఉచితంగా వాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే.. సిగ్గులేకుండా బిఆర్‌ఎస్ అన్నీ తామే చేసినట్లుగా చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అయినా 6 గ్యారంటీలంటూ కాంగ్రెస్ హామీలిచ్చింది… అసలు అప్పులను ఎట్లా తీరుస్తారు? 6 గ్యారంటీల అమలుకు నిధులెక్కడి నుండి తీసుకొస్తారు? మీ ప్రణాళిక ఏమిటి? సంపదను ఏ విధంగా సృష్టిస్తారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలి అని డిమాండ్ చేశారు.
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుంది? దీనివల్ల ముస్లిం పేద సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉగ్రవాదులను తయారు చేయడంతోపాటు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడే సంస్థ తబ్లిక్ జమాతే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీలో 130 కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్‌పై స్పందిస్తూ.. తాము ఎప్పటి నుండో ఆరోపిస్తున్నామని, నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపలేదని అన్నారు. ఇప్పటికైనా స్పందించింనందుకు సంతోషంగా ఉందన్నారు. దీనిపై తమ పార్రటీ పక్షాన పోరాడుతాం, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేదాకా ఉద్యమిస్తాం అని పేర్కొన్నారు.