Monday, January 20, 2025

కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా?: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః అధిష్టానాన్ని ధిక్కరించిన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ అధిష్టానం మాట వినడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీతో పొత్తు ఉండదని వరంగల్ సభలో రాహుల్ గాంధీ స్పష్టం చేసినప్పటికీ , ఆయన మాటను ధిక్కరించి పొత్తులపై వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారం పంచుకోవాలని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో బండి సంజయ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సెన్ నాయక్, పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే తండాల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బంజారాహిల్స్‌లో ఉన్న సేవాలాల్ మందిరాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆనాటి బ్రిటీష్ పాలకులు, ముస్లిం పాలకుల మత ప్రచారంతో ఇబ్బందులు పడిన బంజారా సమాజాన్ని తన ధర్మ ప్రచారంతో సేవాలాల్ రక్షించారని అన్నారు. లిపి లేని బంజారా జాతికి దిశానిర్దేశం సేవాలాల్ చేశారన్నారు. కేంద్రంలో ఎనిమిది మంది గిరిజనులు మంత్రులుగాను, ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉన్నారని ఆయన తెలిపారు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన కార్పోరేషన్ ఏర్పాటు చేసి గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎపి మాదిరిగా తెలంగాణలోని గిరిజన తండాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్రంలో గిరిజన బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News