Monday, December 23, 2024

‘బండి’కి బ్రేక్

- Advertisement -
- Advertisement -

ప్రజా సంగ్రామ
యాత్రను నిలిపివేసిన
పోలీసులు
కరీంనగర్‌కు తరలింపు,
గృహ నిర్బంధం
యాత్రను ఆపను :
బండి సంజయ్
పోలీసుల చర్యపై
హైకోర్టులో పిటిషన్
దాఖలు

మన తెలంగాణ/జఫర్‌గడ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రను పోలీసులు మంగళవారం అడ్డుకుని, అరెస్టు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని జనగామ జిల్లాలో యాత్రకు అనుమతిలేదని వర్థన్నపేట ఎసిపి నోటీసీలు జారీచేసి యాత్రను అడ్డుకున్నారు. “పాదయాత్ర పేరుతో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలి. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నోటీసులు పరిగణనలోకి తీసుకోకుండా తిరిగి ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసకుంటాం” అని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయం 11గంటలకు జఫర్‌గడ్ మండలంలోని ఉప్పుగల్లు, కూనూరు మీదుగా యాత్ర సాగాల్సి ఉంది.

సోమవారం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని పాంనూరులో యాత్ర ముగింపు అనంతరం పాంనూరు, ఉప్పుగల్లు మధ్యలో రాత్రి బస చేశారు. మంగళవారం యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 10 గంటల ప్రాంతంలో పరిస్థితులు తారుమారయ్యాయి. కెసిఆర్‌పై బండి చేసిన వాఖ్యలపై యాత్రను అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ శ్రేణులు ఉప్పుగల్లులో పెద్ద ఎత్తున మోహరించారు. వరంగల్ అడిషనల్ డిసిపి వైభవ్ గైక్వాడ్ నేతృత్వంలో పోలీసులు సంజయ్‌ని అరెస్టు చేసేందుకు సిద్దమయ్యారు. ఆయన బస చేసి ఉన్న బస్సులోంచి బయటికి రాగానే అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడున్న రాష్ట్ర స్థాయి బిజెపి నాయకులు, కార్యకర్తలు పోలీసులకు అడ్డుతగిలారు. అతికష్టం మీద పోలీసులు బండిని పోలీస్ వాహనం ఎక్కించారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. నాయకులు, కార్యకర్తలు వాహనానికి అడ్డుపడి పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన అదనపు బలగాలు వాహనానికి తాడుతో ప్రత్యేక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి బిజెపి శ్రేణులను చెదరగొడుతూ సంజయ్‌ని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంలో పోలీసులు సుమారుగా గంటపాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బండిని అక్కడి నుంచి తరలించడంలో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

టిఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉప్పుగల్లు యాత్ర ప్రారంభం అవుతుందన్న నేపథ్యంలో మంగళవారం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, డిసిసిబి ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, జనగామ జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ములుగు జడ్పీ ఛైర్మన్ జగదీశ్ ప్రసాద్‌తో పాటు వారి అనుచరగణం, వర్ధన్నపేట్, పాలకుర్తి నియోజవర్గాల నుంచి టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తును ఉప్పుగల్లుకు తరలివచ్చారు. బండి సంజయ్ బసచేసిన ప్రాంతానికి వస్తుండంతో పోలీసులు వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు.

హైకోర్టులో బిజెపి పిటిషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరంగల్ పోలీసులు మంగళవారం నాడు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు. పాదయాత్రలో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ యాత్ర ఇలానే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News