Saturday, December 21, 2024

నాలుగో సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం భూదోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ధరణి, భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధరణిపై విచారణ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగో సిటీ పేరుతో కాంగ్రెస్ నాయకులు భూదందాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, బిఆర్‌ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని బండి విమర్శలు గుప్పించారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ముందుగానే వేల ఎకరాలును తమ చేతుల్లోకి తీసుకున్నారని, ఆ ప్రాంతంలో నాలుగో సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు చేయాలని చూస్తున్నారని బండి ధ్వజమెత్తారు. మహేశ్వరంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడికి భూసేకరణ బాధ్యతలు అప్పజెప్పారని ఆరోపణలు చేశారు. నాలుగో సిటీ పేరుతో కాంగ్రెస్ నాయకులు వేల కోట్లు సంపాదించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ వాళ్లు ధరణితో మోసం చేస్తే కాంగ్రెస్ తీసుకొచ్చిన భూమాత భూమేతగా మారుతుందని ఎద్దేవా చేశారు. బిఆర్ ఎస్ వాళ్లు గుడిని మింగితే గుడి లింగాన్ని మింగేటోళ్లు కాంగ్రెసోళ్లు అని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News