తెలంగాణ రాష్ట్రంలో 2028లో జరిగే ఎన్నికల్లో రానున్నది బిజెపి ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ జోస్యం పలికారు. బీఆర్‌ఎస్ మళ్లీ వచ్చే పరిస్థితి లేదని, అంతారాసిపెట్టుకోండి 2028లో రానున్నది రామరాజ్యమేనని అన్నారు. తెలంగాణలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యి మీద పడినట్లు అయిందని చెబుతూ కెసిఆర్ వద్ద శిక్షణ పొందిన కార్యకర్తలే కాంగ్రెస్ నాయకులని ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న ఓ కన్వెన్షన్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై మోర్చాలు, సెల్స్ సంయుక్త కార్యశాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేసి పొరపాటు చేశామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు.
బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో విలీనం ఖాయమని, త్వరలోనే అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే 38 మంది ఎమ్మెల్యేలున్నా బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. బిజెపి కవితకు బెయిల్ ఇప్పించిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోందని, సుప్రీంకోర్టుకు, తమ పార్టీకి ఏం సంబంధమని బండి ప్రశ్నించారు. సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ వ్యాఖ్యలు ఉన్నందునే కోర్టు హెచ్చరించిందని గుర్తు చేశారు. బిజెపి కుటుంబ, అవినీతి పాలనకు తాము వ్యతిరేకమని ఎట్టి పరిస్థితిలోనూ బీఆర్‌ఎస్‌తో కలువబోదని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ గడీలను బద్దలు కొట్టిన చరిత్ర తమ పార్టీదేనని బండి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టిందని,
రెండుసార్లు జైలుకు పంపిందని గుర్తు చేసిన ఆయన కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నో అవమానాలను తట్టుకొని, దేశం కోసం, ధర్మం కోసం నిలిచిన పార్టీ బీజేపీ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాట ముచ్చట అయిపోయిందని, త్వరలో కలసిపోతాయనిబండి సంజయ్ ఆయా పార్టీలకు బదులిచ్చారు.