Tuesday, January 7, 2025

అభయ హస్తం కాదు..భస్మాసుర హస్తం : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతు భరోసా బకాయి చెల్లించకపోగా, ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన రైతు భరోసా హామీకి సైతం తూట్లు పొడిచి ఇందిరమ్మ అభయ హస్తమంటే, భస్మాసుర హస్తమని నిరూపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో “కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం” పేరుతో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హమీలకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనకు పొంతనే లేదని విమర్శించారు. ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము చెల్లిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

కానీ నేడు అందుకు భిన్నంగా రూ.12 వేలు మాత్రమే రైతులకు ఇస్తానని ప్రకటించడమంటే రైతులను మోసగించడమేనని విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, అయినప్పటికీ ఏడాదిపాటు రైతు భరోసా చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డారని, ఆలస్యమైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని, గత ఏడాది చెల్లించాల్సిన బకాయి కూడా చెల్లిస్తారని ఆశించిన రైతులకు పూర్తి నిరాశే ఎదురైందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదనంగా నయాపైసా కూడా సాయం చేయలేదని తేటతెల్లమైందన్నారు.

ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీ లేదు

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాదిపాటు తూట్లు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఏడాదిలోనైనా వాటిని పూర్తిస్తాయిలో అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలనెల రూ. 2500 రూపాయలు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని తెలంగాణ ఆడబిడ్డలను నిండా ముంచారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెబితే ఏడాదిగా ఎదురుచూస్తున్న అవ్వాతాతల నోట్లో మట్టికొట్టారని, రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తారని ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఎగనామం పెట్టారని విమర్శించారు.

నెలానెలా రూ.4 వేల భృతి ఇస్తారని, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగులను నడిరోడ్డున పడేశారని ఆరోపించారు. ఇల్లులేని పేదలందరికీ జాగా తోపాటు రూ. 5 లక్షల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని హామీ ఇచ్చి పేదల బతుకులను ఓట్ల కోసం అందరినీ వాడుకుని అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అతి త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేసి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచుతామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News