హైదరాబాద్: హిందూ ధర్మం కోసం మాట్లాడటమే మతతత్వమైతే, బరాబర్ మాట్లాడతా, అవసరమైతే మతతత్వవాది అనే బోర్డును మెడలో వేసుకుని తిరిగేందుకు సిద్ధమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హిందుత్వం గురించి మాట్లాడితే తనను మతతత్వవాది అనే ముద్ర వేస్తున్నారని ఆయన అన్నారు. హిందూ ధర్మానికి ఆపద వస్తే వెంటనే స్పందించేవాడే నిజమైన హిందువు అని తెలిపారు. ఎంపి, ఎంఎల్‌ఎగా గెలవాలనే తపనతో హిందుత్వం కోసం నటించే వాళ్ళు నిజమైన హిందువులు కాదన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజాన్ని ఏకం చేసేవాడే నిజమైన హిందువు అని అన్నారు.
శనివారం జగిత్యాల జిల్లా బొమ్మెన గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్ మాట్లాడారు.. తెలంగాణలో రామరాజ్యాన్ని స్థాపించే వరకు విశ్రమించబోను అని అన్నారు. అయ్యప్ప స్వామి, సరస్వతి అమ్మవార్లను తిట్టినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. హిందువులు ఇంకా మౌనంగా ఉంటే బొట్టు పెట్టుకుని కనిపించినా రోడ్లపై ఉరివేస్తారేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. గల్లా ఎత్తుకుని తిరగాలంటే హిందూ ధర్మం కోసం నిరంతరం పనిచేసిన శివాజీ మహారాజ్ విగ్రహాలను ఊరూరా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శివలింగంపై మొగల్ సైనికులు మూత్రం పోస్తే ఆనాడు చిన్న పిల్లవాడిగా ఉన్న శివాజీ, పెద్దయ్యాక వాళ్ళందరినీ తరిమి కొట్టిన వీరుడని కొనియాడారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేవుళ్ళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చే సంస్కృతి మంచిది కాదన్నారు. పిల్లలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు నైతిక విలువలను అలవర్చాలని ఆయన కోరారు. పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయించి దీపం ఆర్పించడం వంటివి ఏ మాత్రం మంచి సంస్కృతి కాదన్నారు. పిల్లలతో దీపాలు వెలిగించాలే తప్పితే ఆర్పించకూడదన్నారు. హిందూ ధర్మానికి మోసం చేయవద్దని, చచ్చేంతవరకు హిందువుగానే బతకాలన్నారు. మతాన్ని కించపర్చేలా వ్యవహరించవద్దన్నారు. మతమార్పిడిలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.