Saturday, February 22, 2025

కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది ఆ పార్టీలే:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలేనని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వేలెత్తి చూపింది తామేనని చెప్పారు.

గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారి, ఇక ఆ పార్టీ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులు అని విమర్శించారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసులేమయ్యాయని నిలదీశారు. ఢిల్లీకి పోయి కాంప్రమైజ్ అయిన మాట నిజం కాదా? అన్నారు. తమపై కేసులు పెట్టవద్దని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారని, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేందుకే అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు.

కేంద్ర బడ్దెట్‌లో తెలంగాణకు లక్ష కోట్లు : వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణకు లక్ష కోట్లు వస్తాయని బండి సంజయ్ తెలిపారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని మండిపడ్డారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా అని కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్ చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు మేం సిద్దమన్నారు. ప్రధాని హోదాకు గౌరవం ఇవ్వకుండా అవాకులు పేలడం సరికాదన్నారు.

ఆ బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది : ప్రముఖ సామాజికవేత్త రాజలింగమూర్తి హత్యపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. ఒక వ్యక్తిని ప్రాణం తీయడమంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. హతుడి భార్య చేస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ కాకముందే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News