Friday, December 20, 2024

తెలంగాణలో 8 నుంచి 12 సీట్లు పక్కా: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదంతోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ చెప్పారు. మంగళవారం కరీంనగర్‌లో బిజెపి మండలాధ్యక్షులతోపాటు కొత్తగా ఎంపిక చేసిన మండల ఇంఛార్జీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసిన 80 శాతానికిపైగా ప్రజలు మోడీనే మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగా ఈసారి ఢిల్లీకి వేసే ఓట్లన్నీ పువ్వు గుర్తుకేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బిజెపి 8 నుంచి 12 ఎంపి స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, ఉద్యోగుల జీతాలకు కూడా పైసల్లేవన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు సిఎం, మంత్రులు కొత్తగా ఇస్తున్న హామీల అమలు దేవుడెరగని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందని ఈసారి బిజెపికి సొంతంగా 350 సీట్లు రాబోతున్నా యని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ఎన్డీఏ కూటమికి 4 వందలకుపైగా సీట్లు సాధించబోతోందని అన్నారు. మోడీ లేని భారత్‌ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనూ ఈసారి బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తేల్చిచెప్పారు. బిఆర్‌ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. పొరపాటున ఎవరైనా బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఎందుకంటే గల్లీలో, ఢిల్లీలో అధికారంలో లేని పార్టీ ఒకవేళ ఆ పార్టీ ఎంపిలు గెలిచినా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఉండదన్నారు. అదే బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వమే ఉన్నందున, రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అదనపు నిధులను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందనన్నారు.

కేంద్రం నుంచి నిధులు రావాలంటే బిజెపిని గెలిపించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలన్నారు. రాష్ట్రంలో నిధుల కొరతతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయడం కష్టసాధ్యం అయ్యేలా కనిపిస్తుందని సంజయ్ అన్నారు. అందుకే సిఎం రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కన్పించడంలేదన్నారు. ఎంపి ఎన్నికల తరువాత కాంగ్రెస్ సర్కార్ మనుగడ ఇబ్బందికరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, అధికార ప్రతినిధి సిహెచ్. విఠల్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇంఛార్జీలు మీసాల చంద్రయ్య, మోహన్ రెడ్డి, కరీంనగర్, రాజన్న జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News