Sunday, December 22, 2024

కొడంగల్‌లో ఎంఐఎం పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తాం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కొడంగల్ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మజ్లిస్ పార్టీ గోడ మీద పిల్లి వంటిదని వ్యాఖ్యానిస్తూ తబ్లిగీ జామాతేకు రూ.2.4 కోట్ల నిధులివ్వడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు డిప్యూటీ సిఎం పదవి ఆఫర్ చేయడం వెనుక ఆ రెండు పార్టీల కలయిక అర్ధమవుతోందని అన్నారు. పాతబస్తీలో 24 దేవాలయాలకు రూ.5 లక్షల బిచ్చమేస్తరా? భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతామని అన్నారు. ఆదివారం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో బోనాలు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయడమంటే రెండు పార్టీల అవకాశవాదానికి పరాకాష్ట అని రెచ్చిపోయారు.

కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల జాగీరా?, దమ్ముంటే కొడంగల్ పోటీ చేయాలిలని, అక్బరుద్దీన్‌కు డిపాజిట్ రాకుండా చేస్తామని హెచ్చరించారు. మజ్లిస్‌ను నామరూపాల్లేకుండా చేస్తామంటూ తీవ్రంగా స్పందించారు. రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయిస్తారని, తబ్లిగీ జామాతే సంస్థకు రూ.2.4 కోట్లు ఇస్తారు గానీ బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలోని దేవాలయాలకు కేవలం రూ.5 లక్షలే ఇస్తారా, హిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా? మీ దగ్గర బిచ్చమెత్తుకోవాలా?” అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీగల్లీలో అధికారికంగా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రతి ఏటా బోనాల పండుగ జరుపుకునే అవకాశం రావాలంటే అన్ని వర్గాలను సమానంగా చూసే బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు.

గతంలో మజ్లిస్ నేత కేసీఆర్‌ను అంకుల్ అనే వాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అన్న అని సంబోధిస్తున్నాడని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల పంచన చేరడం మజ్లిస్‌కు అలవాటేనని అన్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్‌ను తిట్టి బీఆర్‌ఎస్ గడీలకు పోయారని, ఇప్పుడు బీఆర్‌ఎస్ ను తిట్టి కాంగ్రెస్ పంచన చేరుతున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News