హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్.. విచారణ జరపాలని డిజిపిని ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. తనకు ఇంకా మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందలేదన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే.. తప్పకుండా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు. మరోవైపు బిఆర్‌ఎస్ నేతల ఆందోళనల నేపథ్యంలో నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
వందల కోట్ల అవినీతి జరిగింది : తరుణ్‌చుగ్
మద్యం కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగిందని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు సోనియాగాంధీ అయినా, కెసిఆర్ అయిన ఒకటేనని అన్నారు. కుంభకోణంలో కవిత నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తరుణ్ చుగ్ తెలిపారు. హవాలా మార్గంలో ఆప్‌కి రూ.వంద కోట్లు ఎలా ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలోని ఓ నానుడిని సంజయ్ చెప్పారు : డికె అరుణ, గీతామూర్తి
బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పు లేదని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అన్నారు. తెలంగాణలోని ఓ నానుడిని సంజయ్ చెప్పారని వారు తెలిపారు. ఈ చిన్న విషయాన్ని బిఆర్‌ఎస్ రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్‌ను తిట్టినప్పుడు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. కెసిఆర్ కూతురు తప్పా మిగతావాళ్లు ఆడబిడ్డలు కాదా? అని అరుణ నిలదీశారు. రాష్ట్రంలో వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై ఎందుకు బిఆర్‌ఎస్ స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. అదే విధంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో… బిజెపి మహిళా మోర్చా నాయకులు జయశ్రీ, ఆకుల విజయ మాట్లాడారు.
నోటీసులు వస్తే హాజరవుతా: బండి సంజయ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -