ఎపి డిప్యూటీ సిఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ n అల్లు అర్జున్..
రేవంత్‌రెడ్డికి ఎక్కడో చెడిందని వ్యాఖ్య
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: ఆరు గ్యారంటీలను రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటికీ అమలు చేయలేదని, రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందని, కానీ మరి సిఎంలో గొప్ప నాయకుడు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు ఎలా కనిపించాడో ఆయనకే తెలియాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. కరీంనగర్‌లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పవన్‌కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు.. నేను వినలేదు.. రేవంత్‌రెడ్డి నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే ఆయనలో మరేమి కనిపించిందో’ అని హాట్ కామెంట్ చేశారు.
సినీ నటుడు అల్లు అర్జున్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎక్కడో చెడిందని వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ జైలుకు వెళ్లి, బెయిల్‌పై వచ్చాడని, ఆ అంశం ముగిసిందన్నారు. కానీ మళ్లీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు సిఎం ఈ అంశంపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై చర్చలు జరపకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగమేనని ఆరోపించారు. అల్లు అర్జున్‌కు, సిఎం రేవంత్‌రెడ్డికి మధ్యలో ఏదో చెడిందని జరిగిన అంశాన్ని బట్టి చూస్తే తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. పుష్ప2 సినిమాకు 17 వందల కోట్ల రూపాయలు వచ్చాయని, పుష్ప3 సినిమా ఇంకా మొదలు కాలేదు కానీ పుష్ప3 సినిమా చూపించారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌పై కేసును ఆనాటి సంఘటనలో మరణించిన మహిళ భర్త వాపసు తీసుకున్నట్లు ప్రకటించాడని, ఇంకా దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ తీరుపై మన్మోహన్‌సింగ్
ఆత్మ క్షోభిస్తుంది…
అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని, పంచ్ తీర్థ్‌లను ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా ఎందుకు అవమానించారని, నాటి ప్రధాని విపి సింగ్ విషయంలో కూడా అవమానించింది కాదా అని ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సోనియాగాంధీ సూపర్ పిఎంగా ఉంటూ అతనిని రబ్బర్ స్ట్టాంప్‌గా తయారు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరును చూసి మన్మోహన్‌సింగ్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.