Monday, February 10, 2025

మొల్తాడు కట్టినోడు..

- Advertisement -
- Advertisement -

బిసిల్లో ముస్లింలను ఎట్లా కలుపుతారు?
ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య
లోపాయికారి ఒప్పందం, మూడూ మేమే గెలుస్తాం
అన్ని కేసులు పెట్టి ఒక్కర్నీ అరెస్ట్ చేయలేదు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

మన తెలంగాణ/నల్గొండ రూరల్ : మొల్తాడు కట్టినోడు.. కట్టనోడు ఒకటవుతారా? బిసిలలో 10శాతం ముస్లింలను ఎలా కలుపుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లాలోని పార్టీ కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఈనెల 27న జరిగే ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు ఎంఎల్‌సి ఎన్నికలు జరుగుతున్నాయని, తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికార కాంగ్రెస్‌కు ఎంఎల్‌సి అభ్యర్థులే కరువు కాగా, బిఆర్‌ఎస్ గురించి పట్టించుకునేవారే లేరని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం కేసు, ఫోన్ టాపింగ్, డ్రగ్స్, ఫామ్‌హౌస్, ఈ ఫార్ములా రేస్ కేసులలో బిఆర్‌ఎస్ నేతలు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, దీనికి ప్రధాన కారణం ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందమేనని అన్నారు. బిసి కులగణన తప్పులతడక అంటూ విమర్శించారు. ముస్లింలను బిసిలలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ కలిసి చేసిన కుట్ర అని విమర్శించారు. ముస్లింలను బిసిలుగా చేరిస్తే బిసి మంత్రులు ఎలా ఒప్పుకున్నారని పశ్నించారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తానని చెప్పిన హామీ, లక్షల ఉద్యోగుల హామీ ఏమైందో స్పష్టం చేయాలన్నారు ఫీజు రియింబర్స్మెంట్ కింద ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు ఇప్పటికే సుమారు రూ.7000 కోట్లు ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటిస్తామని ప్రగల్బాలు పలికి, ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదన్నారు. విద్యాశాఖలో రెగ్యులర్ ఎంఈఓ డిఈఓ లేకపోవడమే కాకుండా అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం హాస్యాస్పదమన్నారు. విద్యా వ్యవస్థ ప్రస్తుతం అర్బన్ నక్షల్స్ చేతిలో ఉందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు. మనోహర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, కాసం వెంకటేశ్వర్లు, ఎంఎల్‌సి అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కంకణాల నివేదిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News