మన తెలంగాణ/హైదరాబాద్ : తన మొబైల్ పోయిందని కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈనెల 4వ తారీఖున అర్ధరాత్రి తనను అరెస్టు చేసిన సమయంలో తాను వాడుతున్న మొబైల్ పోయిందంటూ బండి సంజయ్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటివరకు ఆయన మొబైల్ పై జరుగుతున్న ప్రచారం మరో మలుపు తిరిగినట్టు అయింది. ఆ ఫోన్ నిజానికి తన సోదరి డాక్టర్ సౌమ్య పేరుపై ఉందని, భద్రత కారణాల వల్ల తాను ఇతరుల పేరుపై నెంబర్లు వాడాల్సి వస్తుందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన కాంటాక్ట్ పోయాయని ఇప్పటికే ఫోన్ కి సంబంధించి పోలీసులు వెతుకుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని కాబట్టి స్పందించి వెంటనే తన ఫోన్ తనకు వచ్చేలా చేయాలని పోలీసులను కోరారు.
ఫోన్ చుట్టూ వివాదం
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వ్యవహారంలో ఈనెల 5న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బిజెపి కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తన ఫోన్ ఎక్కడో పడిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మెయిల్ ద్వారా కరీంనగర్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫోన్ చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి సంబంధించి బండి సంజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది.
బండి సంజయ్ ఫోన్ ఇవ్వట్లేదు – వరంగల్ సిపి రంగనాథ్
పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర లేకపోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు? ఆ ఫోన్ తెస్తే అంతా బయటపడుతుంది అని వరంగల్ సిపి రంగనాథ్ చెబుతున్నారు. బండి సంజయ్ తన ఫోన్‌ను పోలీసులకు ఇవ్వలేదని చెబుతున్నారని ఆయన అంటున్నారు. కానీ బండి సంజయ్ తన ఫోన్‌ను ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్న సమయంలో కూడా ఉపయోగించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. మరి పోలీసులు ఆయన ఫోన్‌ను ఎందుకు తీసుకోలేదు? తీసుకుకోకుండా ఇవ్వలేదని చెబుతున్నారా? అన్న సందేహాలు వస్తున్నాయి. బండి సంజయ్‌ను ఫోన్ గురించి అడిగితే లేదన్నారని సిపి అన్నారు. ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని వారికి తెలుసని, అందుకే ఫోన్ ఇవ్వట్లేదన్నారు. అయినా బండి సంజయ్ ఫోన్‌కాల్ డేటా సేకరిస్తామని సిపి తెలిపారు. పేపర్ షేర్ చేసిన అందరికీ ప్రశాంత్ ఫోన్ చేయలేదన్నారు. పిల్లల సాయంతో ప్రశ్నపత్రం లీక్ చేశారన్నారు. కొన్ని ఫోన్లలో మెసేజ్‌లు డిలీట్ చేశారని, వాటిని రిట్రైవ్ చేయాలన్నారు. కాల్ డేటా సేకరించాల్సి ఉందన్న సిపి ఎలాంటి కుట్ర చేయకపోతే బండి సంజయ్ ఫోన్ ఇవ్వొచ్చు కదా అని వరంగల్ సీపీ రంగనాథ్ ఇటీవల అన్నారు.
నేడు విచారణకు హాజరుకానున్న ఈటల
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నోటీసులందుకున్న బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డిసిపి కార్యాలయంలో విచారణకు హాజరవ్వనున్నారు. గురువారం హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ఈటలకు వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డిసిపి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈటలకు ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి నేరుగా వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసులపై స్పందించిన ఈటల రాజేందర్ వరంగల్ డిసిపికి లేఖ రాశారు. ఎస్‌ఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఈనెల 10వ తేదీన వస్తానని చెప్పారు. నేరుగా హన్మకొండ డీసీపీ కార్యాలయంలో 11 గంటల వరకు హాజరవుతానన్నారు.