రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో దాదాపు పది లక్షల ఎకరాల మేరకు పంటలు ఎండిపోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా పంటలకు తగిన సమయంలో నీటిని వదలకపోవడం వల్లే ఇప్పటికే పంట ఎండిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కొజొన్న పంటలు వేసినప్పటికీ ఆయకట్టు చివరి పంటలకు నీళ్లందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలు ఎండిపోయి రైతులు పడుతున్న ఇబ్బందులపై తక్షణమే అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై హైదరాబాద్‌లో గురువారం బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు పభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయని,
ఫలితంగా వానా కాలంలో రికార్డు స్థాయిలో అంటే 160 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి ధాన్యం దిగుబడి వచ్చిందని కేంద్రమంత్రి వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాసంగిలోనూ 56 లక్షల ఎకరాల్లో వరి, మరో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేశారని గుర్తు చేశారు. వీటితోపాటు జొన్న, పప్పుదాన్యాలు, నూనెగింజల పంటలు కూడా వేశారని తెలిపారు. యాసంగి పంటలు వేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. యాసంగిలో ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలనే అంశానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ అమలు చేయలేదని ఆ ప్రకటనలో వెల్లడించారు. మరో నెల రోజుల్లో పంటలు కోతకు రాబోతున్న తరుణంలో పొలాలకు నీరందక పోవడంవల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. చెరువుల్లో నీరు తగ్గడంతో భూగర్భ జలాలు పడిపోయి బావులు, బోర్ల కింద పంటలన్నీ ఎండి నేలరాలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాన ప్రాజెక్టుల్లో 340 టీఎంసీలకుపైగా నీటి నిల్వలు
శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ, సింగూరు సహా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 340 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇందులో 150 టీఎంసీల మేరకు డెడ్ స్టోరేజీ పోగా, మరో 190 టీఎంసీలకుపైగా నీరు అందుబాటులో ఉందని, తాగునీటి అవసరాలకు మినహాయించి మిగిలిన నీటిని సకాలంలో విడుదల చేసి చెరువులు నింపినట్లయితే పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తేది కాదని ఆయన పేర్కొన్నారు.
కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవసాయ శాఖ ప్రణాళిక లేని కారణంగా నీళ్లున్నా వాడుకోలేకపోవడంవల్ల రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ అంశాన్ని కూడా కేంద్రంపైకి నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా రైతులను ఆదుకునేందుకు ప్రకటన చేయాలని, మరింత నష్టం జరగకుండా వెంటనే ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.