సంగారెడ్డి : నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సిఎం కెసిఆర్‌ను, ఆయన కుటుంబాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. సంగారెడ్డిలో గురువారం సాయంత్రం జరిగిన నిరుద్యోగ మార్చ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐబి నుంచి పోతిరెడ్డి పల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో మంత్రి కెటిఆర్ ఆటలాడుకున్నారని ఆరోపించారు. నకిలీ నోటిఫికేషన్లు ఇస్తూ,స్కాంలకు పాల్పడుగూ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఐటి మంత్రిగా ఉన్న కెటిఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహరంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా తమ పార్టీ పోరాడుతుందన్నారు.
తెలంగాణా రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం ధన వంతులయ్యారని, ప్రజలు మాత్రం బికారులయ్యారని పేర్కొన్నారు.రాష్ట్రం కోసం 1400 మంది ప్రాణ త్యాగం చేశారని, కానీ కెసిఆర్ కుటుంబం ఒక్కటే తెలంగాణాలో బాగుపడిందన్నారు.ఇది కెసిఆర్ జిల్లా అట కదా..ఒక్క ఫ్యాక్టరీ అయినా వచ్చిందా?ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?అని ప్రశ్నించారు. తెలంగాణాలో నయా నిజాం పాలను తరిమి కొట్టే రోజులు దగ్గరకొచ్చాయన్నారు.రామ రాజ్యం స్థాపిస్తామన్నారు. మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తే..మరో 5 లక్షల కోట్లు అప్పులు చేస్తాడని, ప్రజలపై భారం మోపుతాడని అన్నారు. కెసిఆర్ కుటుంబం అనేక అక్రమ దందాలు చేస్తున్నారన్నారు.ప్రజల దృష్టి మరల్చడానికే బిఆర్‌ఎస్ పేరుతో డ్రామాలు అడుతున్నారని పేర్కొన్నారు.
14న హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర జరుగుతుందని, అక్కడికి అంతా తరలి రావాలని కోరారు. అంతకుముందు ఐబి వద్ద జరిగన సభలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, విజయశాంతి తదితరులు ప్రసంగించారు.పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బాబూమోహన్, నందీశ్వర్‌గౌడ్, విజయపాల్‌రెడ్డి,ఆకుల లలిత, గోదావరి అంజిరెడ్డి, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, శ్రీకాంత్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.