కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్.. దోపిడిదారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. ఈ మేరకు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో రేప్ కేసులు 28.94 శాతం, మహిళల హత్యలు 13శాతం పెరిగాయని మండిపడ్డారు. అలాగే, కిడ్నాప్‌లు, అపహరణ కేసులు 26శాతం పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్లను కూలగొట్టడం, వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం, గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టడం వంటి దుర్మార్గమైన పనులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదన్నారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు.