Monday, March 17, 2025

తెలంగాణ మరో శ్రీలంకలా మారబోతోంది:మంత్రి బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ మరో శ్రీలంకలా మారబోతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్‌లో బిజెపి జిల్లా నూతన అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అంతకుముందు రగుడు చౌరస్తా నుండి పాత బస్టాండ్, అంబేద్కర్ చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెన్నమనేని వికాస్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి మాట్లాడుతూ..రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ. లక్షన్నర కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై అధిక భారం మోపుతోందని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపాయన్నారు. అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను అమ్మడానికి చూస్తోందన్నారు. కులగణన పేరుతో రాష్ట్ర ప్రజల ఆస్తిపాస్తుల వివరాలను సేకరించి, ఆర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టి రాష్ట్రంలో తుపాకీ రాజ్యం తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. బిజెపి ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్ చేసిన ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్మూలా ఈ రేస్, భూముల కుంభకోణం, కాళేశ్వరంతో సహా అన్ని స్కాముల్లో కెసిఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏదఏమైనా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తాము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వాళ్ల లెక్కలు తేలుస్తామన్నారు.

సిరిసిల్ల కార్యకర్తలు పోరాటయోధులని, కెటిఆర్ సిరిసిల్లకు వస్తుంటే ముందస్తు అరెస్టులు చేయించేవారని గుర్తు చేశారు. పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్లేనని, అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి సత్తా చూపించామని, ఇక ముందు రాబోయేవి కార్యకర్తల ఎన్నికలేనని అన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక లక్షంతో పనిచేసి బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, ఉపాధ్యక్షుడు శీలం రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News