రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని, వీరిద్దరూ ఆర్‌ఎస్ బ్రదర్సేనంటూ మాజీ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. శనివారం కరీంనగర్‌లో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కెటిఆర్‌కు పనీపాట లేదు..ప్రజలెవరూ దేకడం లేదు, ఎంఎల్‌సి అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి పారిపోయినోడు, కాంగ్రెస్‌కు లోపాయికారీ సపోర్ట్ చేస్తున్నది మీరే’ అని ఆరోపించారు. ‘కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, మీ బామ్మర్ది ఫాంహౌస్‌లో డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేసు స్కాంలో కచ్చితమైన ఆధారాలున్నా మిమ్ముల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు’ అని ప్రశ్నించారు.
అంటే నిజమైన కెఆర్ బ్రదర్స్ (కెటిఆర్, రేవంత్ రెడ్డి) మీరే.. నీ దొంగ నాటకాలు బంద్ చెయ్, నీది బిచ్చపు బతుకు.. ఇంకా నీ అహంకారం పోలే’ అని మండిపడ్డారు. ‘నీ బతుకంతా నా దగ్గర ఉంది, పర్సనల్ గా పోవద్దని నేను ఆగుతున్నా, సవాల్ చేస్తే అవన్నీ బయటపెడతా, నాపై లీగల్ నోటీసు ఇచ్చి పారిపోయిన పరికిపందవు నువ్వు’ అని ధ్వజమెత్తారు. ‘కెసిఆర్ లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవు’ అని వ్యాఖ్యానించారు. ‘నువ్వు అవినీతి పరుడివే, రేవంత్ రెడ్డి అవినీతి పరుడే, కాంగ్రెస్‌పై కొట్లాడేది బిజెపి మాత్రమే’ అని అన్నారు. ‘కాంగ్రెస్‌కు మీ పార్టీ ఎటిఎంలా మారింది. నువ్వు ఇంకోసారి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా..
‘అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం, డేట్, టైం, వేదిక ఫిక్స్ చేయమని కోరుతున్నా’ అని అన్నారు. 14 నెలల రేవంత్ రెడ్డి పాలనపైన, 10 ఏళ్ల కెసిఆర్ పాలనపైన, మోదీ పాలనపై ఎవరేం చేశారో? లెక్కలతో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ చేసిన మోసాలను, అవినీతి, అక్రమాలను, 15 శాతం కమీషన్ వివరాలపైనా బహిరంగ చర్చకు సిద్ధం అన్నారు. సిఎంకు దమ్ముంటే చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
బిజెపి అంటేనే బిసిల పార్టీ…
తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కానేకాదని, ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. బిసి జాబితాలో ముస్లింలను చేర్చి బిసిలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ . ..ఇయాళ బిసి జపం చేయడం సిగ్గుచేటన్నారు. బీసీ జపం చేస్తున్న ఆ పార్టీని చూస్తే నవ్వొస్తోందన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో రూ.వేల కోట్ల దోపిడీ
ఒక్క ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుకు రూ.లక్ష నుండి 10 లక్షల దాకా వసూలు చేయబోతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై, 6 గ్యారంటీలపై తమ పార్టీ నిలదీస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో వేల కోట్ల దోపిడీకి సిద్ధమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం 25 లక్షల 53 వేల 786 దరఖాస్తులు వస్తే.. మొత్తంగా రూ.50 వేల కోట్ల జమ చేయాలని సిద్ధమయ్యారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేస్తామని ప్రజలకు మాట ఇచ్చారని, ఆ మాటకు కట్టుబడాల్సిందేనని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పచ్చీస్ ప్రభారీల సమావేశంలో ఎంఎల్‌ఎలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, పట్టభద్రుల ఎంఎల్‌ఎసి అభ్యర్థి అంజిరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బిసి పనుల్లో పైకప్పు కూలిన దుర్ఘటన పట్ల కేంద్ర మంత్రి బండి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన సాయం అందించాలని కోరారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.