మన తెలంగాణ/హైదరాబాద్‌ః పాతబస్తీ పక్కా హిందువులదేనని, పాత బస్తీ వదిలి వెళ్ళిన హిందువులంతా తిరిగి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్న ఆయన హిందూ సమాజానికి ఏదైనా సమస్య వస్తే ముందుకు వచ్చేవారే హిందువులన్నారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేవరకు తాము ఊరుకోమని అన్నారు. పాత బస్తీలోని ప్రతీ గల్లిలో గణేష్ పండుగ అద్భుతంగా జరుగుతుందని అన్నారు. పాతబస్తీలో ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మ రక్షణ కోసం సమయం కేటాయించాలని కోరారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా భారత్ మాతాకి జై అని నినదించాలని పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాల్లో భక్తి, దేశభక్తి కలిసి ఉంటాయని అన్నారు. హిందూ సమాజం, దేశం పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే అంతా ఒక్క తాటి పైకి రావాలన్నారు. హిందూ పండుగలు చేసుకోవాలంటే అన్ని అనుమతులు కావాలని, కానీ వేరే పండుగలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని అన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పోరాటం చేస్తే ట్యాంక్ బండ్ పై నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం రంజాన్ పండుగకు రూ.3 కోట్లు కేటాయించిందని, అయితే హిందూ పండగలకు డబ్బులు కేటాయించలేదని విమర్శించారు. తాము ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
వంద రోజుల్లో మేము ఎన్నో చేశాం..!
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర నాయకులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మహిళల కోసం రూ.3 లక్షల కోటు, కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించామని తెలిపారు. ముద్రా రుణపరిమితిని పెంచడంతో పాటు రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.. 75 వేల మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేశామని, మూలధన వ్యయం కింద మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.11 లక్షల 11 వేల కోట్లు కేటాయించామని వివరించారు.
బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ఛార్జీలను తగ్గించామని తెలిపారు. మహిళల కోసం నారీ శకి’ పేఎంఏవై కింద రూ.3 లక్షల కోట్లు, 2 లక్షల 35 వేల మంది స్వయం సంఘాలకు చెందిన 26 లక్షల మంది మహిళలను ఆదుకునేందుకు రూ.5 వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలు మంజూరు చేశౠమని తెలిపారు. నాలుగు లక్షల 30 వేల స్వయం సంఘాలకు చెందిన 26 లక్షల మందికి 2 వేల 500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను విడుదల చేసి కేంద్రం మహిళలకు ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు. ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలకు పెంచామని స్పష్టం చేశారు. చెప్పుకోవడానికి ఇవే అయినప్పటికీ ఇంకా ఎన్నో ఉన్నాయని అన్నారు. మరి కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైందని, ఆరు గ్యారంటీలను కూడా ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో నెరవేర్చిన హామీలపై సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించబోరని అన్నారు.
సామాజిక సంక్షేమంలో భాగంగా దేశంలోని 63 వేల ఆదివాసీ, గిరిజన గూడెల్లోని 5 కోట్ల మంది ఎస్టీల ఆర్ధిక స్థితిగతులు మార్చే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజ్ అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించి ఆరు కోట్ల మందికి లబ్ది చేకూరుస్తున్నట్లు వివరించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. మౌలిక వసతులు, రోడ్డు కనెక్టివిటీ కోసం 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టులను రూపొందించినట్లు తెలిపారు. 50 వేల 600 కోట్ల రూపాయలతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ కారిడార్లను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. న్యాయంపై దృష్టి సారించి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ప్రవేశపెట్టడంతోపాటు పేపర్ లీక్‌లను నివారించేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.