Monday, December 23, 2024

ముమ్మాటికీ రాజకీయ కుట్రే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె. తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వ తంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమన్న కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజ య్ మహా అజ్ఞానీ అని తేలిపోయిందని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్య వస్థల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహన లేకుండా ఎంపి ఎలా అయ్యాడో అర్థం కా వడం లేదని కెటిఆర్ దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య తెలియకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు.

భూ రికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం బండి సంజయ్ దగుల్భాజీ రాజకీయాలకు నిరద్శనమన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్, టిఎస్పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని కెటిఆర్ హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో అభాసు పాలై, పరువునష్టం కేసు ఎదుర్కొంటున్నారన్నారు. అయినా బుద్ధ్ది రాలేదని, ఈసారి కూడా తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని కెటిఆర్ హెచ్చరించారు.

బిజెపి నాయకులే ప్రధాన సూత్రధారులుగా…

బిజెపి పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కెటిఆర్ తెలిపారు. బిజెపి ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా దాదాపు వందకు పైగా సందర్భాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీలు జరిగాయని ఇందులో స్వయంగా బిజెపి నాయకులే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందనన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లోనే 8 సంవత్సరాల్లో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై స్పందించడం లేదని బండి సంజయ్‌ను కెటిఆర్ నిలదీశారు. మరి ఈ పేపర్ లీకేజీల పైన ప్రధానమంత్రి మోడీని బాధ్యున్ని చేసి ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయన్నారు. అక్కడ పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ లేక అక్కడి ముఖ్యమంత్రిని కానీ ఏనాడు బిజెపి బాధ్యులను చేయలేదని కెటిఆర్ గుర్తుచేశారు. స్వయంగా బిజెపి నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలోనూ బిజెపి ఎలా వ్యవహారించిందో దేశం మొత్తానికి తెలుసన్నారు. బిజెపి ప్రభుత్వాల హయాంలో జరిగితే ఒకలా ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహారించడం బిజెపి డబుల్ స్టాండర్డ్స్‌కు నిదర్శనమన్నారు.

సిట్ ను నియమించి బాధ్యులను వెంటనే అరెస్టు చేశాం

ఎప్పుడైనా ఎక్కడైనా లోపం జరిగితే ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుందన్నదే ముఖ్యమని ప్రజలు గుర్తించాలని కెటిఆర్ విజ్ఞప్తిచేశారు. టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో సిట్ ను నియమించి బాధ్యులను వెంటనే అరెస్టు చేసిందని కెటిఆర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇది బాధాకరమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదని యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని టిఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కెటిఆర్ స్పష్టంచేశారు. ఒకవైపు ప్రభుత్వం స్పందించిన పారదర్శక తీరును పట్టించుకోకుండా కేవలం మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాన్ని బిజెపి మానుకోవాలని కెటిఆర్ హెచ్చరించారు. ప్రతిసారి తమ స్వార్ధ రాజకీయాలకు సమాజంలో చిచ్చుపెట్టే అలవాటు బిజెపికి కొత్త కాదని, ఈ వ్యవహారాన్ని సైతం బిజెపి శాంతి భద్రతల సమస్యగా మార్చే కుట్ర చేస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే వారిని పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలన్న దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్‌కు అసలు యువత గురించి మాట్లాడే అర్హత లేదని కెటిఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తే తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అన్న దుర్మార్గుడు బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర యువత మర్చిపోలేదన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచీగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్‌నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని కెటిఆర్ మండిపడ్డారు. ఈ కేసులోని నిందితులు బిజెపి యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టి పేపర్ ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బిజెపిదే అన్నారు. శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బిజెపి ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఇలా రాజకీయాల కోసం యువత భవితతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటి మోసగాళ్ల పట్ల రాష్ట్రంలోని యువతీ, యువకులు అప్రమత్తంగా ఉండాలని కెటిఆర్ సూచించారు.

రెండింతలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ

రాష్ట్రంలోని యువకులు, విద్యార్థులు టిఎస్పిఎస్సి ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మరొకసారి కెటిఆర్ విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే మా ప్రభుత్వం ఇచ్చిన హామీ కన్నా రెండింతలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువత పట్ల తన నిబద్ధతను చాటుకున్నదన్నారు. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలన్న సమున్నతమైన ఆశయంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిందని, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి తెలిపారు. ఒక వ్యక్తి వలన జరిగిన దురదృష్టకరమైన సంఘటన బాధాకరమన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క ఆరోపణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీచేసిన మన పబ్లిక్ సర్వీసు కమిషన్ యూపీఎస్సీతోపాటు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కెటిఆర్ విజ్ఞప్తిచేశారు.

ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తున్నా మన్నారు. అయితే ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలనుకుంటూ కుటిల రాజకీయ పార్టీల అసలు నైజాన్ని, మొసలి కన్నీరును గుర్తించి చైతన్యంతో వ్యవహారించాలని యువతకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా, అవసరమైన కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని రకాల సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అందిస్తామని కెటిఆర్ తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్ర యువత ప్రయోజనాలు కాపాడటం కోసం జాగ్రత్తతో వ్యవహారిస్తుందని, వారిపట్ల తమ నిబద్ధతను గుర్తించాలని కెటిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News