Sunday, November 17, 2024

బండి ‘యాత్ర’తో కమలం ఆశలు

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay launches Praja Sangrama Yatra

4 నియోజకవర్గాలు…8 రోజులు….91 కి.మీలు
30న జిల్లాలోని ప్రవేశం….
సెప్టెంబర్ 6న మోమిన్‌పేట్ నుంచి
సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశం
భారీగా ఏర్పాట్లు చేస్తున్న స్థానిక కమలం నేతలు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పట్టుకోసం కమలదళం కష్టపడుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆశలు పెట్టుకున్న కమలదళం ఉమ్మడి జిల్లాలో మెజారిటి స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంబించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇతర పార్టీల నుంచి వలసలపై భారీ ఆశలు పెట్టుకున్న కమలదళం ఇప్పటివరకు నిరాశే మిగిలింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రారంబించిన ప్రజా సంగ్రామ యాత్రపై జిల్లా పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసుకోవడానికి పాదయాత్ర కలసివస్తుందని అంచనాలు వేస్తున్నారు. చెవెళ్ల సెంటిమెంట్‌గా పాదయాత్ర నిర్వహించి వైయస్ చరిత్ర సృష్టించగా బాగ్యలక్ష్మి దేవాలయం నుంచి యాత్ర ప్రారంబించిన చెవెళ్ల మీదుగా సాగనుండటంతో కమలం నేతలు సైతం విజయంపై దీమాగా ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టత కోసం బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకత్వం గత కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై పోరుబాట పట్టడంతో పాటు ఇతర పార్టీల నుంచి బడానేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాత్రం బిజెపిలో చేరగా మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తాడని కమలం శ్రేణులు చాలా దీమా వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత వారి ఆశలు ఫలించేస్థాయిలో లేవని కమలం నేతలు స్వయంగా ఒప్పుకుంటున్నారు. పాదయాత్రలో ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరై పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసుకోవడానికి యాత్రను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కమలదళం సన్నాహాలు చేస్తుంది.

యాత్ర రూట్ మ్యాప్ ఇదే

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 8 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ఈ నెల 28 న హైద్రాబాద్‌లో యాత్ర ప్రారంభం అయిన ఈ నెల 30 న నగరం నుంచి రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జీ వద్ద జిల్లాలోనికి ప్రవేశిస్తుంది. మొదటి రోజు 13 కి.మి సాగనున్నయాత్రలో ఆరమైసమ్మ దేవాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి రాత్రికి మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌నగర్ వద్ద రాత్రి విరామం ఉంటుంది. ఈ నెల 31 న హిమాయత్‌నగర్ నుంచి ప్రారంబించి మొయినాబాద్ మీదుగా కనకమామిడి వరకు పది కి.మీ పాదయాత్ర సాగనుంది.

సెప్టెంబర్ 1 కనకమామిడి నుంచి కెతిరెడ్డిపల్లి, అప్పారెడ్డి గూడ చౌరస్తా, తోల్‌కట్టా చౌరస్తా గుండా చెవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల, పలుగుట్ట, మల్కాపూర్ మీదుగా చెవెళ్ల కు యాత్ర చేరనుంది. సెప్టెంబర్ 2 న చెవెళ్ల నుంచి బయలుదేరి ఇబ్రహింపల్లి, దామరగిద్ద, మీర్జాగూడ, ఖానాపూర్ గేట్, ఆలూర్ గేట్ ద్వారా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని చిట్టెంపల్లికి చేరుకుంటుంది. సెప్టెంబర్ 3న మన్నెగూడ, వెంకెపల్లి మీదుగా వికారాబాద్ శివారు సాయి డెంటర్ కళాశాల వరకు 12 కి.మీ యాత్ర సాగనుంది. 4 న వికారాబాద్ జిల్లా కేంద్రం గుండా కొత్తగడి, మందాన్‌పల్లి వరకు 11 కి.మీ యాత్ర సాగనుంది. 5 న వెల్చాల్ మీదుగా 13 కి.మీ పాదయాత్ర మోమిన్‌పేట్ వరకు సాగనుంది. సెప్టెంబర్ 6న మోమిన్‌పేట్ నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌కు పాదయాత్ర సాగి ఉమ్మడి జిల్లాలో ముగుస్తుంది.

భారీగా ఏర్పాట్లు

రాష్ట్ర పార్టీ రథసారథి బండి సంజయ్ పాదయాత్ర విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ నేతలు భారీగా ఎర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న యాత్ర జిల్లాలోనికి ప్రవేశిస్తున్న ప్రాంతం నుంచి పాదయాత్ర సాగే రూట్ అంతటా ఇప్పటికే భారీ ప్లెక్సీలు, హోర్టింగ్‌లు, వాల్‌పోస్టర్‌లు, వాల్ రైటింగ్‌లతో నింపేశారు. చెవెళ్ల పార్లమెంట్ ఇంచార్జీ జనార్దన్ రెడ్డి భారీ స్వాగత తోరణాలు దర్శనం ఇస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మద్యలో ప్లెక్సిలు ఏర్పాటు చేశారు. పాదయాత్ర రూట్‌లో స్థానికంగా జన సమీకరణ భాద్యతలను స్థానిక పార్టీ నాయకత్వంకు అప్పగించారు. పాదయాత్రలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావలసిన అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సింహరెడ్డి, చెవెళ్ల పార్లమెంట్ ఇంచార్జీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News