హైదరాబాద్: వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 27 జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, దీనివల్ల లక్ష మందికి పైగా రైతులకు అపార నష్టం వాటిల్లిందని చెప్పారు. తక్షణమే సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని కోరారు. రబీ సీజన్‌లో వడగళ్ల వాన, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం ఇది రెండోసారి. మార్చి మూడో వారంలో వడగళ్ల వాన కారణంగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు.
మార్చి నెలలో రామడుగు గ్రామంలో నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, అయితే రైతులకు 33 శాతానికి పైగా పంటనష్టం కలిగితేనే పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం షరతు విధించిందన్నారు. 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని, పరిహారం కోసం తక్షణమే రూ.228 కోట్లు విడుదల చేస్తామని సిఎం ప్రకటించారని సంజయ్ గుర్తు చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత ప్రభుత్వం ఏప్రిల్ 19న కేవలం రూ. 150 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు ఆ నిధులు ఒక్క రైతు ఖాతాల్లోకి జమ కాలేదన్నారు. ఈ సీజన్‌లో 73 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, వేరుశనగ వంటి వివిధ పంటలు సాగయ్యాయి.
వడగళ్ల వాన, భారీ వర్షాల కారణంగా తొమ్మిది లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకుంది. నాటి నుండి నేటి వరకు పంట నష్టపోయిన రైతులకు నయాపైసా సాయం చేయలేదన్నారు. రైతులు ఏడుస్తుంటే.. పరామర్శించాల్సిన మంత్రులు బిఆర్‌ఎస్ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేస్తుండటం సిగ్గుచేటు అన్నారు. మూడేళ్లలో 18 వేల 500 కోట్ల రూపాయల మేర రైతులు నష్టపోయారు. నష్టపోయిన ప్రతి రైతుకు యుద్ధ ప్రాతిపదికన నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. 14 లక్షల మంది కౌలు రైతులను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.
‘