Sunday, December 22, 2024

జైలు నుంచి కార్యకర్తలకు బండి సంజయ్ లేఖ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహోన్నతమైన భారతీయ సమాజ నిర్మాణమే అంతిమ లక్ష్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జైలు నుంచి పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ప్రియమైన కార్యకర్తలారా.. భరతమాత ముద్దు బిడ్డల్లారా.. మీ అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పార్టీ స్థాపించి నేటికి 43వ ఏళ్లయింది. పార్టీ కోసం ఎంతో మంది తమ జీవితాలనే త్యాగం చేశారు. మరెందరో తమ ప్రాణాలను అర్పించారు. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా బిజెపికి అధికారం ఒక్కటే లక్ష్యం కాదు.

మహోన్నతమైన భారతీయ సమాజం నిర్మాణమే అంతిమ లక్ష్యం అన్నారు. నాపై మోపిన పేపర్ లీకేజీ కేసు కుట్రలో భాగమే అన్నారు. కార్యకర్తలను నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే బిఆర్‌ఎస్ ప్రభుత్వం నాపై కేసు మోపి జైలుకు పంపింది. నాకు కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్తకాదు. ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా. నా బాధంతా నిరుద్యోగుల భవిష్యత్ పైనే అని పేర్కొన్నారు. బిజెపి కార్యకర్తలను నిర్భంధించడమంటే బంతిని నేలకేసి కొట్టడమే. ఎంతగా విసిరి కొడితే అంతే వేగంగా పైకి లేస్తం అని వెల్లడించారు.

పోలీసులకు ’బలగం’ చూపిస్తే బాగుండేదన్నారు:సంజయ్ భార్య అపర్ణ
పోలీసులకు ఇటీవల విడుదలైన ’బలగం’ సినిమా చూపిస్తే బాగుండేదని.. అలాగైనా వారికి కుటుంబ సంబంధాలు అర్థమయ్యేవని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్లు ఆయన సతీమణి అపర్ణ చెప్పారు. కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్‌ని గురువారం ములాఖాత్‌లో ఆమె కలిశారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆరెస్ట్ చేయడం పట్ల బాధ పడటం లేదని అరెస్టు చేసిన సందర్భమే బాగాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News