మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నర్సింహారావు జన్మించిన ‘వంగర’లో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతోపాటు సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో కొత్తగా 18 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే అందులో సిద్దిపేట జిల్లా అంశం ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ సిద్దిపేటలోని హుస్నాబాద్ నియోజకవర్గం వంగరలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు విజ్ఞప్తి చేశారు.దీంతో పాటు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, వాటిలో భాగంగా సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి మండలంలో రెండు పాఠశాలలను ప్రధానమంత్రి శ్రీ స్కీమ్ కింద స్థాపించాలని అభ్యర్థించారు. ఈ స్కీం కింద ఎంపికైన ప్రతి పాఠశాలకు రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరవుతాయని, తద్వారా ఆయా పాఠశాలలను సమగ్రాభివృద్ధి చేసే అవకాశం ఏర్పడనుందని వివరించారు. అలాగే కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించాలని కోరుతూ బండి సంజయ్ కేంద్ర మంత్రికి మరో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టెక్నికల్ యూనివర్సిటీ అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య అభివృద్ధి, టెక్నికల్ విద్యను ప్రోత్సహించడానికి యూనివర్సిటీ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అధునాతన విద్యాసంస్థల కొరతను తీర్చడం ద్వారా యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ అత్యవసరమని పేర్కొన్నారు. బండి సంజయ్ వినతి పట్ల సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రదాన్ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ మండలాల్లో పీఎం శ్రీ పాఠశాలలు ఏర్పాటు చేయండి
-కరీంనగర్ టౌన్, కోతపల్లి, కరీంనగర్ రూరల్, మనకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర, రామడుగు,- చొప్పదండి,- చిగురుమామిడి,- హుజూరాబాద్, వీనవంక, – సైదాపూర్, జమ్మికుంట, ఎల్లందకుంట, శంకరపట్నం మండలాల్లో పీఎం శ్రీ కింద పాఠశాలలను ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు.