Monday, December 23, 2024

మహనీయుల విగ్రహాలను అవమానిస్తే ఖబడ్దార్: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: మహనీయుల విగ్రహాలను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రసక్తే లేదు.. ప్రతిఘటించి తీరుతాం. ఖబడ్దార్..”అంటూ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. గజ్వేల్ లో శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసిన దుండుగులను ప్రతిఘటించిన సామాన్య కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి ప్రతిఘటించిన వారిపై కేసులు పెట్టడ దారుణమన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లోనే హిందూ సమాజంపై దాడి జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం సీనియర్ నేత బాస సత్యనారాయణరావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి కరీంనగర్ జిల్లా జైలుకు వెళ్లిన బండి సంజయ్ అక్రమంగా అరెస్టైన 11 మంది కార్యకర్తలను పరామర్శించారు. గజ్వేల్ ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేస్తే ఫుల్ బాటిలిస్తానని ఎవడో అంటే.. సంఘ విద్రోహ శక్తులు వెళ్లి ఆ పని చేయడం దుర్మార్గం అన్నారు. దీనిని ప్రశ్నించిన మహేశ్ గౌడ్ పై దాడి చేయడం అన్యాయం అన్నారు. స్థానిక కౌన్సిలర్ రవీందర్ దీనిని అడ్డుకునే యత్నిస్తే బండ బూతులు తిడుతూ దాడి చేసి చంపేస్తామంటూ బెదిరించడం దుర్మార్గం అన్నారు. జరిగిన ఘటనపై ఆందోళన చేస్తే… దుండుగుల దౌర్జన్యంలో చాలా మంది అమాయకుల తలలు పగిలాయి అని పేర్కొన్నారు. ఈ దౌర్జన్యానికి పాల్పడ్డ 30 మందిని అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తే… ఫిర్యాదు చేసిన కుమార్ తోపాటు 11 మంది సామాన్య కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపడం బాధాకరం అన్నారు. అట్లాగే 30 మంది దౌర్జన్యానికి పాల్పడితే… వారిలో అరుగురిని మాత్రమే అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు.

శివాజీ విగ్రహం వద్ద టాయిలెట్ చేస్తే వద్దని బతిమిలాడాలా? ఆ స్థాయికి దిగజారాలా? సొంత నియోజకవర్గంలో ఘటన జరిగితే సీఎం ఎందుకు స్పందించడం లేదు? దుర్మార్గులు ఎస్‌ఐపై దాడి చేస్తుంటే ఊరుకోవాలా? శివాజీసహా అంబేద్కర్, జగ్జీవన్ రాం సహా దేశభక్తుల విగ్రహాలకు అవమానం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేన్నారు. శివాజీ విగ్రహం వద్ద టాయిలెట్ చేసిన వారిని ప్రతిఘటించడం తప్పేమీ కాదని, వారిని సమర్ధిస్తున్నామని, వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నామన్నారు.
ఎన్‌హెచ్ 563 పనులకు 2146 కోట్ల 86 లక్షలుః
కరీంనగర్ -వరంగల్ (ఎన్ హెచ్ 563) 4 లేన్ విస్తరణ పనులకు 2146 కోట్ల 86 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 30 గ్రామాల్లో ఈ పనులు చేపడుతున్నామన్నారు. భూసేకరణ విషయంలో ప్రజలు ఎంతో సహకరించిన, వారికి నా తరపున ధన్యవాదాలు చెబుతున్నా అని బండి పేర్కొన్నారు. అంతెందుకు గతంలో కరీంనగర్ -వరంగల్ రోడ్డు గుంతల మయమై ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోలేదన్నారు. నేనే వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి 45 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు 4 లేన్ విస్తరణ కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినని తెలిపారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జికి వంద శాతం నిధులు కేంద్రులే..
కరీంనగర్ ఆర్వోబీ (తిగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు రాష్ట్ర వాటా ఇవ్వకుండా మాట తప్పారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని కేంద్రంతో మాట్లాడి వంద శాతం నిధులు కేంద్రం నుండి తీసుకొచ్చినని తెలిపారు. అయినా కొందరు నేతలు మేమే ఇదంతా చేశామని ప్రచారం చేసుకోవడం చూస్తే నవ్వొస్తుందని ఎద్దెవ చేశారు. ప్రజలకు అన్నీ తెలుసు అని వారే సరైన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.
మోదీ సభను విజయవంతం చేయాలిః బండి సంజయ్
తెలంగాణకు ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ది కోసం పెద్ధ ఎత్తున కేంద్రం నిధులు కేటాయిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని మోదీ వస్తున్నందున వరంగల్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరుతున్నామని పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News