వచ్చే సంక్రాంతి లోపు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని తన కార్యాలయంలో దీన్‌దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్‌లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను ఆయన ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నారని అన్నారు. కాలేజీల యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితి ఉందని, విద్యార్థులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుంటే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక ఇది అని అన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చువుతాయని అంచనా వేశారు. ఆ మొత్తాన్ని కేంద్రం భరించేందుకు సిద్ధమైందన్నారు.