Wednesday, September 18, 2024

హామీలను ఎగ్గొట్టడమే ప్రజా పాలనకు గీటురాయా?:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి నేత బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఇన్నాళ్లు కొనసాగిన పాలన ప్రజా కంఠక పాలన అని కాంగ్రెస్ అంగీకరించినట్లేనా? అని ప్రశ్నించారు. గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు వచ్చిన బండి సంజయ్ కుమార్ జిల్లా పార్టీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి సికింద్రాబాద్ జనరల్ బజారులోని బట్టలు, బంగారు దుకాణాల వద్దకు తిరుగుతూ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో భారత్ ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ కి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని, వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తారా? మమ్ముల్ని కూల్చమంటారా? అంటూ సిఎం హెచ్చరించడం సిగ్గు చేటన్నారు. అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో సభ్యత్వ నమోదులో సంచలనం స్రుష్టిస్తామని ఆయనన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడమే ప్రజా పాలనా? రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నడ్డి విరగ్గొట్టడమే ప్రజా పాలనా? ఉద్యోగులకు ఇస్తామన్న టిఎ, డిఎ, పిఆర్‌సి ఇవ్వకుండా మోసం చేయడమేనా ప్రజా పాలనా? రోడ్లమీద పసిపిల్లలను కుక్కలు పీక్కుతింటున్నా పట్టించుకోకపోవడమే ప్రజా పాలనా? ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే వాళ్ల ద్రుష్టిని మళ్లించేందుకు ఆడుతున్న హైడ్రామాయే ప్రజా పాలనా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులెలా పర్మిషన్ ఇచ్చారు? రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే కూలుస్తారా? ప్రభుత్వ నిర్వాకంవల్లే అక్రమ నిర్మాణాలు వెలిశాయి కదా? మరి అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో ముందు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలపై ద్రుష్టి మళ్లించడానికి హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. . దీనిపేరుతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ప్రజల ద్రుష్టిని మళ్లిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి స్వదేశాన్ని విమర్శిస్తారా? గతంలోనూ విదేశాలకు వెళ్లి భారత్ ప్రమాదంలో ఉంది.

జోక్యాం చేసుకోవాలని పాశ్చాత్య దేశాలను కోరిన మూర్ఖుడు రాహుల్ గాంధీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కులను ఊచకోత కోసి దుర్మార్గంగా వ్యవహరించిందే రాహుల్ గాందీ నానమ్మ ఇందిరాగాంధీ అని, సిక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేదని అన్నారు. దేశాన్ని చీల్చాలని కుట్ర చేసే వాళ్లతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నాడని, అందుకే ప్రత్యేక దేశం కావాలని భారత్ ను చీల్చాలనుకుంటున్న టెర్రరిస్టు సంస్థలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సమర్ధిస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. రాహుల్ కు, టెర్రరిస్టు సంస్థలకు లింకులున్నాయని అనుమానం వస్తోందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని మూడు ముక్కలు చేసిందని, రాహుల్ గాంధీ పొరపాటున అధికారంలోకి వస్తే మళ్లీ 7 ముక్కలు చేసే ప్రమాదముందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News