హైదరాబాద్: తాము రోజుకో హిందూ దేవుడిని మొక్కితే కొంతమందికి నొప్పి ఎందుకని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడారు.. అయ్యప్పను కించపరిచే విధంగా కొందరు మాట్లాడటం దారుణమన్నారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళను కించపరిస్తే బిజెపి సహించబోదని ఆయన హెచ్చరించారు. హిందు దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని హిందూవాహిని వంటి ధర్మ సంఘాలు ఉపేక్షించబోమని ఆయన తెలిపారు.
ఏ రాజకీయ పార్టీలో ఉన్నవారైనా సరే హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోవద్దని అన్నారు. హిందువులంతా సంఘటితంగా భారతీయ సంస్కృతి, ధర్మాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైన హిందు ధర్మాన్ని కించపరిస్తే నాకెందుకు అని ఊరుకోవద్దని, బడితపూజ చేయాలని అన్నారు. సంఘటితంగా ఉంటేనే హిందూ ధర్మాన్ని కాపాడుకోగలమని చెప్పారు. హిందువులుగా పుట్టిన వారు హిందువుగానే చనిపోదామని అన్నారు. మహిళలు బొట్టు బిళ్ళలను కాకుండా కుంకుం బొట్టు పెట్టుకోవాలని ఆయన కోరారు.