Sunday, December 22, 2024

నమ్మి ఓట్లేస్తే.. నట్టేట ముంచుతారా?: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిందుకు రైతులను నట్టేట ముంచుతారా అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని తన కార్యాలయం లో మంగళవారం తాను చేపట్టిన ‘రైతు దీక్ష’ విరమణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లోకి గేట్లు ఎత్తడం కాదు..సాగునీటి ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి నీళ్లివ్వండి’ అని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులంతా కన్నీరు పెడుతున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించా రు. పట్టణాల్లో మంచి నీటి కొరత ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. సకాలంలో సాగు నీరు విడుదల చేయకపోవడం వల్ల రైతుల పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో చాలాచోట్ల పంట నష్టం జరిగినా నేటికీ పైసా పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.

ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాల్సిందేనని అన్నారు. వడ్ల్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, తక్షణమే వడ్లు సహా అన్ని పంటలకూ రూ.500 బోనస్ ప్రకటించాల్సిందేనని అన్నారు. ‘తాలు, తరుగు, తేమ సాకుతో వడ్లను రైతులను దోచుకునే సంస్కృతికి పాతరేయండి’ అని అన్నారు. రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి తీసుకు రావొద్దని హితవు పలికారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం చేతకాదు, ఆదుకోవాలని కేంద్రానికి సిఎం లేఖ రాస్తే ప్రధాని మోడీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. అయితే, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కెసిఆర్ సర్కార్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్‌లో మిగిలేది ఆరుగురు మాత్రమేనని సైటైర్ వేశారు.పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌కు ఓట్లేస్తే ఎరువుల సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదముందని అన్నారు. ‘మేం బరాబర్ శ్రీరాముడి ఫొటోతో ఓట్లడుగుతాం.. వాళ్లకు దమ్ముంటే బాబర్ ఫొటోతో ప్రచారం చేసుకోవాలి’ అని సూచించారు. కెసిఆర్ ఫాంహౌస్ నుండి రాజకీయాలు చేస్తే, కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

రైతన్నకు క్షమాపణ చెప్పి కెసిఆర్ కరీంనగర్ రావాలి
వరి వేస్తే ఉరే గతి అన్న వ్యక్తి, పంట నష్టపోతే నయాపైసా పరిహారమివ్వని వ్యక్తి, ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని మాట తప్పిన నేత, రైతులకు క్షమాపణ చెప్పిన తరువాతే కెసిఆర్ కరీంనగర్ రావాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News