ఖమ్మం: జిల్లాలో కారేపల్లి మండలం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నేతల నిర్లక్షం వల్ల పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, బాధ్యులైన భారాస నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ అన్నారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, తదితర నేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బాణసంచా పేల్చారు. ఈ క్రమంలో తారాజువ్వ సమీపంలోని గుడిసెలో పడి నిప్పు అంటుకుంది. దీంతో గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలవురు కాళ్లు, చేతులు కోల్పోయారు. గాయపడిన వారిలో పలువురు జర్నలిస్టులు, కానిస్టేబుళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.