హైదరాబాద్ : మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం అన్ని త్యాగం చేసిన బాధిత కుటుంబాలను ఆదుకుంటానని ఇచ్చిన హామీని నేరవేర్చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం వేములవాడ నియోజకవర్గంలోని రుద్రవరంలో మిడ్ మానేరు బాధితుల ఐక్య వేదిక నాయకులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిడ్ మానేరు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. తమ కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనికి నిరసనగా ఈ నెల 8, 9 తేదీల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు వారు ప్రకటించారు.
Also Read: బిజెపిలో చేరిన మైనార్టీ నాయకులు
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ముంపు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలిస్తామనే హామీనీ చేర్చాలని కోరుతూ వారు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మిడ్ మానేరు బాధితులు కోరేది గొంతెమ్మ కోర్కెలు కానేకావు. కెసిఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం. ఒక్కో కుటుంబానికి 5 లక్షలివ్వాలి. 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ఇవ్వాలి. ఇండస్ట్రీయల్ కారిడార్ ను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వ తీరుపై మండిపాటు…
ప్రజా సమస్యలపై పోరాడుతూ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న బిజెపి జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా బండి సంజయ్ మండిపడ్డారు. “వరదలతో నష్టపోయిన హైదరాబాద్ ప్రజలను కాపాడాలని, సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తుంటే… ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు.