Sunday, April 6, 2025

రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తోంది మోడీ బియ్యమే:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం మోడీ పంపిస్తున్న బియ్యమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ సన్న బియ్యం పేరుతో కాంగ్రెస్ తామే సొంతంగా పంపిణీ చేస్తున్నట్లు డ్రామాలాడుతోందని ఆరోపించారు. వడ్ల కొనుగోలు పేరుతో ప్రతి సీజన్‌కు సగటున రూ.10 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని అన్నారు. ఈ లెక్కన ఏటా సగటున రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, సమాజ సంస్కర్త స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఈ ఏడాది వానా కాలం సీజన్‌కు రూ.12 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని తెలిపారు.

‘వడ్లకు కనీస మద్దతు ధర రూ.2,203లు చెల్లిస్తోంది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. ఇవిగాక రవాణా, మిల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జీలతో పాటు మిత్తితో సహా వడ్ల పైసలు చెల్లిస్తోందని అన్నారు.ఈ లెక్కన ఒక్క కిలో బియ్యానికి రూ.37 ఖర్చు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. ఇంత ఖర్చు చేసి పేదలకు ఉచితంగా మోదీ ప్రభుత్వం పంపిణీ చేస్తుంటే కనీసం ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరని బండి సంజయ్ నిలదీశారు. బీజేపీ కార్యకర్తలు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటోలు పెడితే చించి వేయించడం ఎంత వరకు కరెక్ట్? అంటే ప్రశ్నించారు. తక్షణమే రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మోదీ బియ్యం తీసుకుంటున్న పేదల ఇండ్ల వద్దకు వెళ్లి భోజనం చేసి సమస్యలు తెలుసుకోవాలని బీజేపీ మండలాధ్యక్షులకు ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News