కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు…రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు దీక్ష’’ చేపట్టినట్లు చెప్పారు.ఈరోజు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందన్నారు.కోట్లాది రూపాయల ప్రకటనలతో 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు?. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైంది?.వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనయ్ వెంటనే బోనస్ ప్రకటించాలన్నారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదు?. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట నీళ్లపాలైంది (అకాల వర్షాలకు రాలిపోయిన మామిడి పిందెలను, రాలిన వడ్ల కంకులను మీడియాకు చూపిస్తూ. సాగునీరు లేక పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అని ఆవేధన వ్యక్తం చేశారు.
తక్షణమే ఎకరాకు రూ.10 వేల సాయం ప్రకటించిన ప్రభుత్వం ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని, రైతులు కష్టాల్లో ఉన్నారని, రూ.10 వేల సాయం సరిపోదన్నారు. తక్షణమే ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని,అట్లాగే రైతు భరోసా పేరుతో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు చెల్లించాల్సిందేనన్నారు. రైతు కూలీలకు సైతం ఏటా రూ.12 వేల ఇవ్వాల్సిందే. కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయరు… పంటల బీమాను అమలు చేయరు.. రైతులెలా బతకాలన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తక్షణమే వడ్ల కొనుగోలు చేయాల్సిందే. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి రైతులకు భరోసా కల్పించేందుకే రైతు దీక్ష చేస్తున్నానని బండి సంజయ్ తెలిపారు.