హైదరాబాద్ : పదవి పోతుందేమోనన్న భయంతోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆదివారం సంఘ సంస్కర్త మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి బిజెపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భాగ్యలక్ష్మీ ఆలయానికి రావాలన్న తన కోరిక నెరవేరిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రూ.25 కోట్లు రేవంత్‌రెడ్డికి ఇచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎక్కడా అనలేదు.
కాంగ్రెస్‌కు ఇచ్చినట్లు మాత్రమే ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు బిఆర్‌ఎస్ ఆర్థిక సహాయం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తాయి. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇదే మాటలు అంటున్నారు. బిఆర్‌ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బు తీసుకున్న మాట వాస్తవం. మునుగోడులో ఈ విషయంపై ప్రచారం జరిగింది. అక్కడి ఓటర్లే దీనిపై స్వయంగా మాట్లాడుకున్నారు‘ అని సంజయ్ వ్యాఖ్యానించారు. ‘రేవంత్ ఏడుపు నిజమే. బాధ ఉంటేనే ఏడుపొస్తది. రేవంత్ రెడ్డి సిఎం కావాలనుకున్నరు. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బిఆర్‌ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఆ బాధతోపాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనను మారుస్తారనే బాధ కూడా తోడై వచ్చిన నీళ్లే రేవంత్ కు కన్నీళ్లుగా మారాయి.” అని వ్యాఖ్యానించారు. పాతబస్తీని న్యూసిటీగా చేయాలని బిజెపి యత్నిస్తుంటే.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఎంఐఎం. అతీక్ అహ్మద్ లాంటి నీచులు చనిపోతే సంతాపం ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. అతీక్ కొడుకును ఎన్ కౌంటర్ చేస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఖండించడం సిగ్గు చేటు అన్నారు. ఓటు బ్యాంకు కోసం మతపరమైన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అవసరమా? తెలంగాణ సమాజం ఆలోచించాలని ఆయన కోరారు.