Saturday, February 22, 2025

ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రజలను దోపిడికి యత్నం:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేయడానికి కుయుక్తులు పన్నుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లిలో తలపెట్టిన ‘పచ్చీస్ ప్రభారి’ సమావేశంలో పాల్గొన్న ఆయన రంగంపల్లిలోని ఎంకెఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. . గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ పథకంపై విమర్శలు గుప్పించి, అధికారంలోకి వస్తే ఉచితంగా భూముల క్రమబద్ధీకరణ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్ర ప్రజలపై రూ.50 వేల కోట్ల భారం పడనుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలోకి కాంగ్రెస్ సర్కారు దిగజారిందని ధ్వజమెత్తారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం రూ. లక్షల 8 వేల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కల చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్రంపై విమర్శలు మాని, ఇచ్చిన నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని నిలదీశారు. అబద్ధాలకు, అవినీతికి కాంగ్రెస్ నిదర్శనమని, ఆ పార్టీని బొందపెట్టడానికి మేధావులు, పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన వారికి వచ్చే బెనిఫిట్లు ఇవ్వడానికి, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరుకు కాంగ్రెస్ నేతలు 15 శాతం కమీషన్లు గుంజుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల కోసం ఉద్యమించింది, లాఠీ దెబ్బలు తిన్నది, కేసులపాలై జైళ్లకు వెళ్లింది బిజెపి కార్యకర్తలేనని, వారి త్యాగాలను గుర్తు పెట్టుకుని ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. రాష్ట్రంలో జరగబోయే మూడు ఎంఎల్‌సి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బండి కోరారు.

20 వేల నోటిఫికేషన్లు ఇచ్చి 50 వేల ఉద్యోగాలు కల్పించినట్లు కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ముస్లింలను బిసిల్లో చేర్చి హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌ఎ గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు కాశిపేట లింగయ్య, గోమాస శ్రీనివాస్, సునీల్ రెడ్డి, కందుల సంధ్యారాణి, శిలారపు పర్వతాలు, కోమల్ల మహేష్, శివంగారి సతీష్, బెజ్జంకి దిలీప్ కుమార్, అమరగాని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News