Wednesday, January 22, 2025

2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే.. “ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యుపిఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. డిఎస్‌సి -2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హామీ ఇచ్చారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద ‘ మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో బిజెపి చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్ మాట్లాడారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బిఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం సిట్‌కు లేదని బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్ కేసు, మియాపూర్ భూములపై వేసిన సిట్ ఏమైందో చెప్పాలన్నారు. లీకేజీ కేసులో పెద్దపెద్ద వాళ్లను వదిలేసి చిన్నవాళ్లను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.

ప్రశ్నపత్రాలు లీక్ అవ్వటం సర్వసాధారణమే అన్న మంత్రికి నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు. పది ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు. 30లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. పరీక్షలు రాసి నష్టపోయిన యువతకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష భృతి ఇవ్వాల్సిందేనన్నారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ విఠల్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశామని చెప్పారు. రేపటి నుంచి అన్ని విశ్వవిద్యాలయాల్లో తిరిగి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. వాస్తవ విషయాలను సమీకరించే ప్రయత్నాలు చేస్తామన్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పది ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు.

నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బిజెవైఎం నాయకులను జైళ్లో వేశారు. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారు. ధర్మం కోసం, నిరుద్యోగుల పక్షాన జైలుకొచ్చిన వాళ్లను వేధిస్తారా? ఇది న్యాయమేనా అని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా విద్యార్థులారా.. తెలంగాణ తరహాలో మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను ఎందుకు తొలగించడం లేదు? తొలగిస్తే వాళ్లు బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యలు లేవన్నారు. బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. యుపిఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. ప్రజా ప్రతినిధులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణమే ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆనాడు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ రోజు రాహుల్ గాంధీ అనర్హతను వ్యతిరేకించడం సిగ్గు చేటు తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఈ రోజు కాశ్మీర్ లో భారత జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారంటే అది నరేంద్రమోదీ ఘనత అన్నారు. తెలంగాణ మూడు తరాల ఉద్యమ చేసిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 2001 నుంచి 2014 వరకు పార్టీలకు, జెండాలకు, రాజకీయాలకు అతీతంగా మూడో దశ ఉద్యమం జరిగిందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాట బొడ్రాయిని పెట్టి ఉద్యమించిందని, సామాన్యుడిని నుంచి పెద్దల దాకా జెఎసిని ఏర్పాటు చేసుకుని నీళ్లు-, నిధులు, -నియామకాల పేరుతో ఉద్యమించామని గుర్తుచేశారు. సిట్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగులనే ఎందుకు విచారిస్తోంది. ఉన్నతాధికారులను ఎందుకు విచారించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. టిఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను ఇంత వరకు సిట్ అధికారులు ఎందుకు విచారించలేదు? నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 55 శాతం ఓట్లు నాకు వచ్చాయంటే… రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చుఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ మహాధర్నాకు హాజరై పలు విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు, తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ (టిజెయూ), డిఎస్‌సి -2008 బాధితుల సంఘం, నిరుద్యోగ యువత సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డి, మాజీ మంత్రులు చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News