Monday, December 23, 2024

ఏనాడూ పట్టించుకోని కెసిఆర్.. ఇప్పుడు పంట పొలాల్లో తిరుగుతున్నారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ఏడాది వచ్చే సరికి పంట పొలాలను సందర్శిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగ దీర్ఘాకాల ప్రయోజనాలను పెట్టుకుని తక్షణమే సమగ్ర పంట బీమా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం కంటి తుడుపు చర్య అన్నారు.

రైతులకు ఇచ్చే సాయం ఏ మూలకు సరిపోదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. దీనిపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎక్కడా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయలేదు. సిఎం మాత్రం 2 లక్షల 28 వేల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో రైతు సంఘాల విజ్ఞప్తులను స్వీకరించే ప్రయత్నం చేయకుండా గృహ నిర్బంధాలకే పరిమితం చేయడం బాధాకరమన్నారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు కనీసం నివేదిక పంపని కెసిఆర్… కేంద్రాన్ని అడగడమే దండగంటూ బదనాం చేయడం సిగ్గు చేటు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందే అవకాశం ఉన్నప్పటికీ, బిజెపికి పేరొస్తుందనే అక్కసుతో ఏళ్ల తరబడి అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. ఈ విషయంలో రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీ భజన చేయడం విచారకరం. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాన్ని ధర్నాచౌక్ కు, రైతుల వద్దకు తీసుకురాగలిగామంటే బిజెపి చేసిన పోరాటాల ఫలితమే అన్నారు. కేంద్రాన్ని విమర్శించడం మానుకుని రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే పంట నష్టంపై సమగ్ర నివేదిక తెప్పంచుకోవడంతోపాటు వాస్తవిక నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News