Wednesday, December 25, 2024

బిఆర్‌ఎస్ తోవలోనే రేవంత్ సర్కార్:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమలు చేయడంలో ప్రజలకు మొండిచేయి చూపుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు రూ.23 కోట్ల నిధులతో పూర్తయిన డబుల్ రోడ్డు, గంభీరావుపేట నుండి మల్లారెడ్డిపేట వరకు మధ్య గల బ్రిడ్జిని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో నిధులు ఇచ్చిందని, కానీ నాటి ప్రభుత్వం తమ సొమ్ముగా ప్రచారం చేసుకుని రాజకీయ వైషమ్యాలతో కుట్ర చేసిందని ఆరుపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిఆర్‌ఎస్ తోవలోనే నడుస్తోందని, రాజకీయ వైషమ్యాలు సృష్టించి, అభివృద్ధి జరగకుండా చేస్తూ కేంద్రంతో వైరం పెట్టుకుంటోందని మండిపడ్డారు.

పేరు ప్రఖ్యాతుల కోసం మొడి పట్టుకు పోయి షో పాలిటిక్స్ చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మితిమీరి విమర్శలు చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో కెసిఆర్ తెలంగాణ డబ్బును పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసిందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండిచేయి చూపిన కాంగ్రెస్‌ను మహారాష్ట్ర ప్రజలు వాస్తవాలు గమనించి, అక్కడ ఓడించి బిజెపికి పట్టం కట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పంచాయతీరాజ్ ఎస్‌ఈ లచ్చయ్య, ఈఈ భూమేశ్వర్, బిజెపి మండల అధ్యక్షుడు గంట అశోక్, సెస్ మాజీ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, మాజీ జెడ్‌పిటిసి మల్లుగారి నర్సాగౌడ్, రాష్ట్ర నాయకులు రాణి రుద్రమ, రెడ్డబోయిన గోపి, పత్తి స్వామిరాజ్, వాజిద్ హుస్సేన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News