Friday, April 4, 2025

42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్రానిదే:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇచ్చే ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది కదా? అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ బుధవారం హైదరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. మోదీ ప్రభుత్వాన్ని అడిగి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారా? అని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమని మీకు తెలియదా?, తెలిసి కూడా ముస్లింలను బీసీ జాబితాలో ఎందుకు చేర్చారు? అంటూ ఆ ప్రకటనలో ప్రశ్నించారు.

తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీలను 46 శాతానికి తగ్గించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలే లబ్ది పొందుతారని పేర్కొన్నారు. ఇప్పటికే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, బీసీలకు అదనంగా ఒరిగేది 5 శాతమేనా అంటూ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ముస్లింలకు లబ్ది చేకూర్చేందుకు బీసీ రిజర్వేషన్లను తెచ్చినట్లుంది తప్ప బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశ్యం కనిపించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తుంటే బీసీ సంఘాలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News