Friday, January 24, 2025

హైడ్రా పేరుతో పేదల బతుకులతో కాంగ్రెస్ ఆటలాడుతోంది:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః హైడ్రా బుల్డోజర్లు ముందు మా బిజెపి నేతలు, కార్యకర్తల మీద నుండి వెళ్ళాలని, ఆ తర్వాతే పేదల ఇళ్ల వద్దకు వెళ్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్లతో యుద్దవాతావరణాన్ని సృష్టించి పేదల ఇళ్లపైకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తాము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాగానే హైడ్రాపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. బిజెపి పేదలకు అండగా ఉంటుందని అన్న బండి సంజయ్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాలతో ఆటలాడుతకుంటోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని బర్కత్‌పురా బిజెపి సిటీ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా పక్వాడ ఫోటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్,

తదితర నేతలు కలిసి ఆదివారం బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో హైడ్రాపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తగులుతుందనిఅన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తుందని మండిపడ్డారు. పట్టాలు, లింకు డాక్యుమెంట్లు, గ్రామ పంచాయితీ అనుమతి ఉన్నా పట్టించుకోకుండా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటున్నందున, ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్ష చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందని, హైడ్రా వల్ల తెలంగాణ అధోగతి పాలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

హైడ్రా, ప్రభుత్వ తీరు మారడం లేదు
హైడ్రా పేరిట పేదల బతుకులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. నిన్నామొన్నటి వరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ఇళ్లను కూల్చిన ప్రభుత్వం ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరిట ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ నాయకులను దాటిన తర్వాతే కూల్చివేతల జోలికి వెళ్లాలని హెచ్చరించారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మరోవైపు గ్రామాల్లోని సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని ఆ మొత్తాలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల విషయంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎలా మోసం చేసిందో, కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో మోసం చేస్తోందని మండిపడ్డారు.

అక్టోబర్ 2న స్వేచ్ఛ సేవా అభియాన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2 వరకు పలు కార్యక్రమాలు చేస్తామని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే రక్తదాన శిబిర కార్యక్రమాలు చేశామని, హెల్త్ క్యాంపుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వివరించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఖాదీ వస్త్రాలను ధరించే కార్యక్రమాలను చేపడతామని ఆయన చెప్పారు. దేశాన్ని నరేంద్ర మోదీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు స్వేచ్ఛ సేవా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News