Monday, December 23, 2024

బరి తెగించిన కాంగ్రెస్:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని, మీడియా ప్రచారం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని నిప్పులు చెరిగారు. ఇక రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని, ఆ పార్టీ క్యాడర్ పోయిందని, లీడర్లు గోడలు దూకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. సోమవారం యూఎస్‌లోని “ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ” ఎన్నారైలతో జరిగిన ఆన్‌లైన్ మీట్లో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించి పాలన చేస్తోంది. అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తోంది. శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతున్నాయని, ఆలయాలను ధ్వంసం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తోందని, ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించి కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఆరోపించారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ 6 గ్యారంటీలను దాటవేస్తోందన్నారు. సీఎం హామీ ఇస్తే వెంటనే అమలు చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందని విమర్శించారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. జాతీయవాద వ్యతిరేక భావజాలమున్న వాళ్లను, నక్సలైట్ సానుభూతి పరులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, వీరంతా మన దేశ చరిత్రను, వివేకానందస్వామి, శివాజీ, వీరసావర్కర్ చరిత్రను కనుమరుగు చేయాలనుకునే వాళ్లేనన్నారు. కమ్యూనిజం, నక్సలిజంకు సానుకూలంగా ఉన్నవాళ్లేనని, అలాంటి వాళ్లతో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయడంవల్ల ప్రజలకు ఏ సంకేతాలు పంపుతున్నారో అర్ధం చేసుకోవాలని కోరారు.

ఆలయాల్లో సోషల్ మీడియా కమిటీలను నియమించాలని పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వానికి లేఖ రాశారంటే హిందూ ధర్మంపై ఏ విధమైన దాడి జరుగుతుందో, పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనంలోకి వచ్చి ముఖం చూపించలేక ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని చెప్పారు. బీఆర్‌ఎస్ కు క్యాడర్ లేకుండా పోయిందని, లీడర్లున్నా వాళ్లంతా ఎప్పుడు ఏ పార్టీలోకి పోదామా? అని గోడమీద పిల్లిలా ఎదురు చూస్తున్నారన్నారు. క్యాడర్, లీడర్ తోపాటు ప్రజా సమస్యలపై కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, ఎన్ని కేసులు ఎదురైనా తెగించి కొట్లాడి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే కసితో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై ఆగడాలపై బీజేపీ కొట్లాడుతుంటే, దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రగతి పథంలోకి తీసుకెళుతుంటే ఓర్వలేకపోతున్నరన్నారు.

దేశాన్ని విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రభుత్వ ఏర్పాటు చేయడం తథ్యం అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఆలయాలను తీర్చిదిద్దుతామని, ఆదాయం కోసం కాకుండా హిందూ ధర్మం, ధార్మికత, భక్తి భావం పెంపొందేలా ఆలయాల్లో సేవలందిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలంతా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని, తద్వారా భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఎన్నారై తన వంతుగా కనీసం ఐదు విదేశీ కుటుంబాలను భారత్‌లో పర్యటించేలా చేయాలని కోరారు. తద్వారా భారతీయ పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటు భారతీయ సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News