రాష్ట్రంలో గత ఏడాదిగా వినాశకరమైన కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అత్యాచార కేసులు 28.94 శాతం, మహిళల హత్యలు 13 శాతం, కిడ్నాప్‌లు 26 శాతం పెరిగాయని విమర్శించారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో మహిళలు ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని, పైగా సాధికారతకు బదులు వారిపై దాడులు చేశారని, ఇళ్లను పడగొట్టారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఏఐసీసీ ఫేక్ న్యూస్ ను వ్యాపింపజేసే వ్యక్తులతో నిండిపోయిందని కూడా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసేది పాలన కాదని, మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భద్రత ఇస్తామని వాగ్దానం చేసిందని, కానీ భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలో 10 వేల మంది బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధాలు, దోపిడీదారు, విధ్వంసకర పార్టీగా మారిందని తీవ్రంగా ఆరోపించారు.