అధికారం కోసం దేశద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్
బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి రావడం ఖాయం
9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిచ్చింది
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది అంతా కేంద్ర నిధులతోనే
వేములవాడ మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ప్రకాశ్ జవదేకర్‌తో బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: అధికారం కోసం దేశద్రోహులతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్ ఇతర పార్టీలతో జత కడుతుందని బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వేములవాడలోని భీమేశ్వర గార్డెన్ లో పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు తుల ఉమ, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, కుమ్మరి శంకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులందరినీ బండి సంజయ్, ప్రకాశ్ జవదేకర్ ఆప్యాయంగా పలకరిస్తూ మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు గ్రామాల్లో ప్రజలకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీదే. టాయిలెట్స్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 5 కిలోల ఉచిత బియ్యం, కరెంట్, ఉపాధి హామీ, గ్రామీణ సడక్ యోజన రోడ్లు, రైతు వేదిక, పల్లె ప్రక్రుతి వనం, హరిత హారం, వైకుంఠధామాల నిర్మాణానికయ్యే నిధులన్నీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమన్నారు. కరోనా సంక్షోమ సమయంలో ప్రజలను కాపాడేందుకు కరోనా వ్యాక్సిన్ అందించారు.
2 వందల కోట్లకుపైగా కరోనా డోసులను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా దేశాన్ని ఆర్దిక సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు ఆత్మనిర్బర్ భారత్ పేరిట 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతు అకౌంట్లో 6 వేల రూపాయల చొప్పున దేశమంతా లక్ష కోట్ల రూపాయల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇవిగాకుండా సబ్సిడీ ఎరువులు అందిస్తూ ఒక్కో ఎకరానికి 24 వేల రూపాయల ప్రయోజనం.. ముద్ర రుణాలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, 5వ స్థానానికి చేరిన భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతూ 2047 నాటికి నెంబర్ వన్ గా మార్చేందుకు కృషి చేశారు. అనంతరం ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న తేడాను వివరించారు. పేదల కోసం మోడీ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని, కరోనా సమయంలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించి ప్రజల ప్రాణాలను మోదీ కాపాడారని పేర్కొన్నారు.