Friday, January 17, 2025

మీరే అనుమతిచ్చి, మీరే వ్యతిరేకిస్తారా?: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో ముందు మీ నాన్న కెసిఆర్‌ను నిలదీయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సూచించారు. ఆనాడు మీరే అనుమతి ఇచ్చి, ఇప్పుడు మీరే వ్యతిరేకిస్తారా? అంటూ బండి మండిపడ్డారు. కెటిఆర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే, దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని విమర్శించారు. వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో విఎల్‌ఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ‘ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం ఇప్పటిది కాదని, గత పద్నాగేళ్లుగా పెండింగ్‌లో ఉందని అన్నారు.

అన్ని అడ్డంకులు దాటుకుని మంగళవారం భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పదేపదే చొరవ తీసుకోవడంవల్లే ఇది సాధ్యమైందని అని బండి సంజయ్ తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం లభించిందని, వికారాబాద్ మండలం పూడురు పరిధిలోని దామగూడెం రిజర్వు అటవీ ప్రాంతంలో 1174 హెక్టార్ల భూమిని (దాదాపు 2900 ఎకరాలు) ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు బదిలీ చేస్తూ 2017 డిసెంబర్ 19న జీవో నెం.44ను అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమోదించిన బీఆర్‌ఎస్ నేతలే ఇవాళ వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలని, ఇది వాళ్ల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన వ్యవస్థను ఆయన కుమారుడి ఆధ్వర్యంలో పార్టీ నేతలు వ్యతిరేంచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

కెటిఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫాంహౌజ్ ఎదుట ధర్నా చేయాలని, రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతిస్తూ భూముల బదలాయింపుకు ఎందుకు అంగీకారం తెలిపారో కెసిఆర్‌ను నిలదీస్తే బాగుండేదని తెలిపారు. దేశ భద్రతకు సంబంధించి అంశాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు రాజీ లేకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ నేతలు వ్యతిరేకించడమంటే దేశ భద్రతను వ్యతిరేకిస్తున్నట్లేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News