Wednesday, January 22, 2025

ఆ పార్టీలను చూస్తేనే మహిళలు భయపడే పరిస్థితి:బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీక్ష చేసే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌కు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోసా బిజెపి భరోసా’ దీక్షలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బండి సంజయ్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. మహిళా సమస్యలపైనా, అన్యాయంపైనా, మహిళా బిల్లుపైన ఏనాడూ నోరు మెదపని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేయడం సిగ్గు చేటని విమర్శించారు.

పార్టీ సంస్థాగత పదవుల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనన్నారు. 1999 నుంచి 2003 వరకు అనేక సార్లు పార్లమెంట్ లో వాజ్ పేయి ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆమోదించకుండా వ్యతిరేకించడమే కాకుండా బిల్లు ప్రతులను సభలోనే చించివేసిన ఎస్పీ, ఆర్జేడీ, ఎంఐఎం పార్టీలతో కలిసి బిఆర్‌ఎస్ అంటకాగుతూ దీక్ష చేయడం విడ్డూరమన్నారు. లిక్కర్ దందాపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుండి దారి మళ్లించేందుకే మహిళా దీక్ష పేరిట డ్రామాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. మహిళల జీవితాలను నాశనం చేసే మద్యం వ్యాపారంలో నిమగ్నమై ఉన్న కవిత మహిళల కోసం దీక్ష చేపట్టడం సిగ్గుచేటని, ఆమె కారణంగా దేశం మొత్తం సిగ్గుతో తల దించుకుంటోందని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు..
కవితకు ఈడీ నోటీసులపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదని రుజువైందన్నారు. లిక్కర్ స్కాంలో సంబంధం ఉందా? లేదా? సిఎం, పిసిసి అధ్యక్షుడు స్పష్టం చేయాలన్నారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోని కెసిఆర్ తన కుటుంబానికి ఆపద వస్తే వణికిపోతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతిపరులు ఎవరైనా మోడీ సర్కార్ వదిలే ప్రసక్తే లేదన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ కరవు : డికె ఆరుణ
రాష్ట్రంలోని మహిళకు గౌరవప్రదమైన జీవనం, విద్య, వైద్యం, ఆరోగ్య భద్రతను కల్పించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ కరువైందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చనని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళా ప్రజాప్ర తినిధులకు గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధికి నిధులు కావాలని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఏర్పడిందన్నారు. మొన్న జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ విషయంలో కూడా అక్కడి ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసిన విషయాన్ని డికె అరుణ ప్రస్తావించారు. మహిళ అంటే తన కూతురు మాత్రమే కాదని, ఈ రాష్ట్రం లో ఉన్న అందరూ అనే విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థులు, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా సిఎం స్పందించడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News