రీంనగర్ : గల్లీలో ఎవరున్నా..ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాల్సిదేనని అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపి బండి సంజయ్ కు మార్ అన్నారు. మోదీ లేని భారత్‌ను ఊహించుకోలేమని, దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ సమీపంలోని తిమ్మాపూర్ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బిజెవైఎం ఆధ్వర్యంలో ‘నమో నవ మత్ దాత” (నవ యువ ఓటర్ల సమ్మేళనం) కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రత్యక్ష ప్రసారాలను వీరంతా వీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాస్ పోర్టు కంటే విలువైన వజ్రాయుధం “ఓటు” అని, ఓటు హక్కుతో మీ తలరాతతోపాటు దేశ భవిష్యత్తును కూడా మార్చుకునే సత్తా ఉందన్నారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటుహక్కు నమోదు చేసుకోకపోవడం బాధాకరమన్నారు. నవ యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన మోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాల్సిన అవసరం యువతపై ఉందన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా మారడం తథ్యమన్నారు. కాగా తాను అయోధ్య కరసేవలో పాల్గొన్నందుకు గర్వపడు తున్నానని…ఆనాడు కరసేవలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది చనిపోతే ఆ రక్తంతో సరయునది ఎర్రబారిందని గుర్తుచేశారు. కరసేవకుల బలిదాన స్ఫూర్తితో మోదీ అయోధ్యలోనే రామ మందిరాన్ని నిర్మించారని పేర్కొన్నారు.
అసహ్యించుకునేలా పోలీసులు వ్యవహారం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
ఎబిబిపి మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటోందని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలని, ఆమెను జుట్టుపట్టకుని స్కూటర్‌పై బరబరా ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకంటే హేయమైన చర్య ఉంటుందా? సభ్య సమాజం అసహ్యించుకుంటోంది”అని మండిపడ్డారు. తక్షణమే సమగ్రమైన న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలని డిమాండ్ చేశారు.