Monday, November 18, 2024

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : బండి సంజయ్
త్వరలో హైదరాబాద్‌లో నిరుద్యోగ మిలియన్ మార్చ్
మనతెలంగాణ/ హైదరాబాద్: వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు.. కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు, బిజెపి శ్రేణులతో కలిసి ఐబి గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లె చౌరస్తా వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు బండి సంజయ్ నడిచారు.

అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాకు ఒక్క కొత్త ఫ్యాక్టరీ అయినా వచ్చిందా? హామీలిచ్చిన నేతలంతా ఎటుపోయారు? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండేది అయిదు నెలలే… ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బిజెపియే. అధికారంలోకి రాగానే బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసినా రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు. ఈ సారి బిజెపికి పాలించే అవకాశమివ్వండని ప్రజలను ఆయన కోరారు. నిరుద్యోగులకు పరిహారం ఇచ్చేదాకా.. అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. వచ్చే నెలలో హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామని ఆయన వెల్లడించారు.

ఈ నెల 14న హనుమాన్ జయంతిన హిందూ శక్తిని చాటేందుకు రాజకీయాలకు అతీతంగా కరీంనగర్‌లో “హిందూ ఏక్తా యాత్ర” నిర్వహించబోతున్నాం.. రాష్ట్రంలోని హిందువులంతా హిందూ ఏక్తా యాత్రకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతితో పాటు రాష్ట్ర నేతలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News